‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 15,2024 22:43

విలేకర్లకు వివరాలు చెబుతున్న డిఇఒ
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ తెలిపారు. దీనిపై శుక్రవారం డిఇఒ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9.30 గంటల నుండి 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని, విద్యార్థులను 8.45 నుండి 9.30 గంటల వరకూ పరీక్షా కేంద్రలోకి అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష ముగింపు సమయం పూర్తయ్యే వరకూ పరీక్షా కేంద్రంలోనే ఉండాలని, బయటకు అనుమతించరని అన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు బాలికలు 13,046 మంది, బాలురు 14,320 మంది మొత్తం 27,366 మంది హాజరవుతున్నారని తెలిపారు. ప్రైవేటు విద్యార్థులు/ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థులు బాల బాలికలు 3925 మంది ఉన్నారన్నారు. 147 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, చీఫ్‌ సూపర్నెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, స్కాడ్స్‌ నియమించామని చెప్పారు. చీఫ్‌ సూపర్నెంట్లు, ఇన్విలేటర్లు ఎవరి దగ్గరా మొబైల్స్‌ ఉండవన్నారు. ఎక్కడా ఫర్నీచర్‌ కొరత లేదన్నారు. హాల్‌టిక్కెట్‌ చూపిస్తే ఆర్టీసిలో సెంటర్‌కు ఉచితంగా వెళ్లి రావచ్చన్నారు. పేపర్‌ లీకేజి వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పేపర్‌ లీకేజికి ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు ఉన్నాయని చెప్పారు. సమావేశంలో గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ జిల్లా సహాయ కమిషనర్‌ వెంకటరెడ్డి, ఇన్‌ఛార్జి డిప్యూటీ డిఇఒ బలరామ్‌నాయక్‌, ఉర్దూ డిఐ ఖాసిం పాల్గొన్నారు.

➡️