పది రోజుల్లో 100 పడకలతో మెడికల్‌ కళాశాల : ఎమ్మెల్యే

Feb 13,2024 23:19

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : గురజాల నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలోని కామేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల వద్ద వంద పడకలతో వైద్యశాలను మరో 10 రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు మెడికల్‌ కాలేజీ వద్ద ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాలలో మే నెల మొదటి వారం కల్లా వంద పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని, మరొక ఆరు నెలల వ్యవధిలో రెండు నెలలకు వంద పడకలు చొప్పున 6 నెలల్లో 600 పడకల వైద్య సేవలు అందిస్తామని వివరించారు. 2025 జూన్‌, జూలై నాటికి మెడికల్‌ కళాశాలలో కూడా పూర్తిచేసి 100 ఎంబిబిఎస్‌ సీట్లతో అందుబాటులోకి తీసుకొస్తామని, ఇలా మరొక ఐదు సంవత్సరాలు వ్యవధిలో మెడికల్‌ సీట్లు పెంచి ఎంతో ఖరీదైన మెడికల్‌ విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వైద్యశాల ప్రారంభమైతే కాలినొప్పి నుండి గుండె నొప్పి వరకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

➡️