పన్నులు పెంచినవారు జీతాలు పెంచలేరా?

నరసరావుపేటలో ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న కార్మికులు
ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట :
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక శుక్రవారం సమ్మె 4వ రోజుకు చేరుకుంది. గుంటూరు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపట సమ్మె శిబిరాల్లో కార్మికులు ఉరితాళ్లు తగిలిచించుకుని నిరసన తెలిపారు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాయం ఎదుట సమ్మె శిబిరాన్ని సిఐటియు గుంటూరు నగర తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అపార్ట్‌మెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఆది నికల్సన్‌, ఆవాజ్‌ నగర అధ్యక్షులు షేక్‌ సైదా, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు షేక్‌ ఖాసీం షహిద్‌ సందర్శించి మద్దతు తెలిపారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ పెడరేషన్‌ జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు ప్రసంగించారు. నరసరావుపేట సమ్మె శిబిరంలో మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌, గౌరవాధ్యక్షులు సిలార్‌ మసూద్‌ మాట్లాడారు. కార్మికుల పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరుకుమార్‌ సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతనలేదన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన లెక్కల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాలుగున్నరేళ్లలో మున్సిపాల్టీల్లో పన్నులు 60 శాతానికిపైగా పెంచారని చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్నారని, కార్మికుల జీతాలు మాత్రం పెంచడానికి చేతులు రావడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల కోరికలు న్యాయంగా కనిపించి ఇప్పుడు మాత్రం అన్యాయంగా తోస్తున్నాయా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మోసం చేసిందని.. తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులందర్నీ రెగ్యులర్‌ చేస్తామని హామీచ్చినవారు అధికారంలోకి వచ్చాక విస్మరించడం మరోమోసంమేనని అన్నారు. పారిశుధ్య కార్మికుల కాళ్లు కడికిన ప్రభుత్వాధినేతలు కడుపులు మాత్రం మాడుస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కనీస వేతనాలు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, హెల్త్‌, రిస్క్‌ అలవెన్స్‌ వంటి సమస్యల పరిష్కారానికి రాతపూర్వకంగా హామీనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు మాట్లాడుతూ ఒకప్పుడు హామీలిచ్చిన వారు ఇప్పుడు బెదిరిస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమ్మెకు తాము పూర్తి అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో డి.యోహాను, టి.మల్లయ్య, పి.యేసు, దీనమ్మ, మహేష్‌ పాల్గొన్నారు.

➡️