పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ : కలెక్టర్‌

Feb 29,2024 21:52

పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

మార్చి1 నుండి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించుటకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమైనది జిల్లా కలెక్టర్‌ ఎస్‌. షణ్మోహన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 4, 6, 9, 12, 14, 16, 19 తేదీలలో జరగనుండగా, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 2న ప్రారంభమై 5, 7, 11, 13, 15, 18, 20 తేదీలలో జరుగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాలలో 28,225 మంది జనరల్‌ మరియు 4,532 మంది ఓకేషనల్‌కు సంబంధించి మొత్తం 32,757 మంది పరీక్షలు వ్రాయనుండగా ఇందులో మొదటి సంవత్సరం పరీక్షలకు 15,905 మంది, రెండవ సంవత్సరం పరీక్షలకు 16,852 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుండి పరీక్షా హాల్‌లోకి అనుమతించబడతారని ఉదయం 9 గంటలు తరువాత క్షణం ఆలస్యమైనా విద్యార్థులు పరీక్షా హాల్‌లోకి అనుమతించబడరని తెలిపారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో 144సెక్షన్‌ను అమలుపరచాలని, జిరాక్స్‌ షాప్‌లను మూసివేయించాలని రెవెన్యూ అధికారులను, పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్‌ బందోబస్తుతో ప్రశ్నాపత్రాల తరలింపు జరగాలన్నారు. ఇన్విజిలేటర్లతో సహావిద్యార్థులు ఎవరూ ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్షాహాల్‌కు తీసుకువెళ్లకూడదని అన్నారు. విద్యార్థులు పరీక్షాకేంద్రాల వద్దకు చేరేందుకు ఆర్టీసీ వారు విస్తత ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద వైద్యఆరోగ్య శాఖ వారు తగిన జాగ్రత్తలు వహిస్తూ తగిన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్‌శాఖ వారు నిరంతర విద్యుత్తు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు పరీక్షా పత్రాలను ఇతర ప్రాంతాలకు చేరువేసేందుకు పోస్టల్‌ డిపార్ట్మెంట్‌ వారు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

➡️