పర్సా సత్యనారాయణ జీవితం ఆదర్శనీయం

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-గుంటూరు :
గని కార్మికుడిగా, సిఐటియు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా, ఎమ్మెల్యేగా పనిచేసి కార్మిక వర్గం ఐక్యత కోసం తుది శ్వాస విడిచే వరకూ పనిచేసిన పర్సా సత్యనారాయణ నేటి తరానికి ఆదర్శమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు అన్నారు. పర్సా సత్యనారాయణ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ఎన్‌జిఒ హోంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు-ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. తొలుత యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు విశ్వనాథం, సిఐటియు నాయకులు హుస్సేన్‌వలి పర్సా సత్యనారాయణ, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జి చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీణారాయణ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి గనిలో సత్యనారాయణ ఉద్యోగిగా చేరి, కార్మికుల ఐక్యత కోసం కృషి చేశారని, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మొత్తం కార్మికవర్గ సమస్యల పరిష్కారానికి పాటు పడ్డారని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసి నిరసన తెలిపారన్నారు. చివరి వరకూ ఆడంబరాలేమీ లేని జీవితం గడిపారన్నారు.ప్రభుత్వాల విధానాలపై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని, బీమా, బ్యాంకులు, గనులు, రైల్వేలు, రక్షణ రంగం సహా కట్టబెడుతోందని విమర్శించారు. విశాఖ ఉక్కును అమ్మటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎపిలో ఉన్న కెజి బేసిన్‌ గ్యాస్‌ను గుజరాత్‌కు తరలిస్తూ ఇక్కడి ప్రజలకు గ్యాస్‌ సబ్సిడీ రద్దు చేశారన్నారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు చేయబోతున్నారని, వాటికయ్యే ఖర్చును కూడా వినియోగదారుల నుండే వసూలు చేస్తారని హెచ్చరించారు. మోడీ పాలనలో గ్యాస్‌, పెట్రోలు, విద్యుత్‌, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామని కేవలం 10వేల మందినే చేస్తున్నారని తెలిపారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు. అంగన్‌వాడీలు, ఆశాలు, విఆర్‌ఎలు పలు స్కీమ్‌ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది షెడ్యూలు పరిశ్రమల కార్మికులు ఏళ్ల తరబడి వేతన సవరణకు నోచక, చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ పర్సా సత్యనారాయణ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కార్మికులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఉద్యోగులు, కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయన్నారు. లేబర్‌ కోడ్‌లు తెచ్చాక 8 గంటల పనివిధానం అమలు కావట్లేదన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టటంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. అంతర్గత కమిటీలు వేయాలన్ని నిబంధనలు ఎక్కడా అమలు కావట్లేదని, మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు అవసరం లేదని బిజెపి నాయకురాలు స్మృతి ఇరాని ప్రకటించటం అన్యాయమని మండిపడ్డారు. ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం మచిలీపట్నం డివిజన్‌ జాయింట్‌ సెక్రెటరీ వి.వి.కె.సురేష్‌ మాట్లాడుతూ దేశ ప్రజలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని, నేషనల్‌ శాంపిల్‌ సర్వే, మానవాభివృద్ధి నివేదిక, ఆక్స్‌ఫామ్‌ వంటి రకరాల నివేదికల ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా భారతదేశం వెనుకబడి ఉన్నట్లు చెప్పాయని వివరించారు. ఈ వెనుకబాటుకు కారణమైన పాలకులు విధానాలను కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. ఎన్‌జిఒ అసోసియేషన్‌ నగర నాయకులు మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల్ని, ఉద్యోగుల్ని వేరు చేయటానికి, ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తోందని, ఉద్యోగులు, కార్మికులు, ఇతర సామాన్య ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. సదస్సులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, నాయకులు ఎన్‌.శివాజీ, కె.శ్రీనివాసరావు, ఎం.భాగ్యరాజు, రమేష్‌, బి.ముత్యాలరావు, బి.లక్ష్మణరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.అనురాధ పాల్గొన్నారు.

➡️