పల్నాటి వీరారాధన ఉత్సవాలు కారంపూడి తిరునాళ్ల

ప్రజాశక్తి-ప్రతినిధి కారంపూడి : చారిత్రక ప్రసిద్ధిగాంచిన కొన్ని దశాబ్ధాలుగా ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పల్నాటి వీరారాధన ఉత్సవాలు మండల కేంద్రమైన కారంపూడిలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన రాచగావుతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు వీరాచారవంతులు వారి పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలతో నిధి (వీరాచార పీఠం) మీదకు చేరుకున్నారు. ఆయుధాలను జీవనది అయిన నాగులేరులో స్నానమాచరింపజేసి ఊరేగించారు. అనంతరం వీర్ల దేవాలయానికి చేర్చారు. అనంతరం రాత్రి వేళలో వీరాచారవంతులు బుర్రకథ రూపంలో సందర్శకులకు వివరించారు. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం ‘రాయభారం’ ఘట్టం ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా తిరుణాళ్ల మహోత్సవాలనికి అనేక ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చే సందర్శకుల కోసం సదుపాయాలు అరకొరగానే కల్పించారు. మహిళలు స్నానమాచరించటానికి తాత్కాలికంగా పరదా పట్టాలతో గదులు ఏర్పాటు చేశారు. అసలే చలికాలం అయినందున రాత్రివేళలో బస కోసం ఏర్పాట్లు లేవని సందర్శకులు పెదవివిరుస్తున్నారు. చారిత్రాత్మక పర్యాటక కేంద్రమైన ఈ ప్రదేశంలో శాశ్వత సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు కరువు, తుపానుల ప్రభావమూ ఉత్సవాలపై ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రతిఏటా మొదటిరోజు వందల సంఖ్యలో చివరి రెండ్రోజుల్లో వేలాది మంది ఉత్సవాలకు హాజరవుతుంటారు. అయితే ఈ ఏడాది ఆ సందడి వాతావరణం కనిపించడం లేదు. పరిమిత సంఖ్యలోనే సందర్శకులు హాజరయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. ప్రతిఏటా ఉత్సవాలకు నెల ముందే ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షలుండేవి. ఈ ఏడాది ఒకసారి మొక్కుబడిగా సమీక్షతో సరిపెట్టారు. జిల్లా పరిషత్‌, జెడ్‌పి పరిషత్‌ నుండి కూడా నిధులు కేటాయించినట్లు కనిపించడం లేదు. తొలిరోజు నుండే ప్రారంభమయ్యే ఎడ్ల పందేలు, సాంస్కృతిక కార్యక్రమాల సందడీ లేకుండా పోయింది.

➡️