పాత కాపులా? కొత్త ముఖాలా?

Mar 15,2024 20:54

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులుగా పోటీ చేసే వారి తుది జాబితా శుక్రవారం ప్రకటించనున్నారు. సిఎం జగన్‌ మోహన్‌ ఇడుపులపాయలో వైఎస్సార్‌ సమాధి వద్ద మొత్తం 175మంది ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించనున్నారు. దీంతో ఆశావహ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మన్యం జిల్లాలో గల నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు పోటీలో ఉంటారనే దానిపై స్పష్టత శనివారం రానుంది. జిల్లాలో మూడు ఎస్టీ, ఒక ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో వైసిపి పోటీ చేయడానికి సిటింగ్‌ ఎమ్మెల్యే లందరికీ అవకాశం దక్కుతుందా లేదా అనేది తెలియడం లేదు. పాత కాపులే బరిలో వుంటారా కొత్త ముఖాలకు చోటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. సాలూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ సిఎం రాజన్నదొర వరుసగా ఐదో సారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనొక్కరే ఇంతవరకు కనిపిస్తున్నారు. అయితే అరుకు ఎంపిగా పోటీ చేయాలని రాజన్నదొరను పార్టీ నాయకత్వం ఆదేశిస్తే తప్ప ఆయనే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారు. ఎంపిగా పోటీ చేయాలని ఉందని ఆయన పలుమార్లు కార్యకర్తల సమావేశాల్లో ప్రకటించారు. కానీ ఎంపీ సీటు కావాలని ఎక్కడా గట్టిగా మాట్లాడిన దాఖలాల్లేవు. ఇక పార్వతీపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరిస్థితి డోలాయమానంలో వున్నట్లు తెలుస్తోంది. భూకబ్జా, దందాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆయనకు రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ ి అధిస్థానం అవకాశం ఇస్తుందా లేదా అంతుచిక్కడం లేదు. టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జయమణి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే జోగారావును కాదని కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. మాజీ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూడా ఆమె ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. మరో అభ్యర్థి పోటీలో లేకపోవడం ఆమెకు అనుకూల పరిణామంగా చెప్పవచ్చు. ఆమె పైన కూడా కొంత ప్రజావ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆమెనే ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక పాలకొండ లోనూ సిటింగ్‌ ఎమ్మెల్యే వి.కళావతికే మరోసారి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆమెకు ధీటుగా పోటీలో ఉండే అభ్యర్థి కనిపించకపోవడంతో ఆమెనే బరిలో దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌తో కొంతవరకు విభేదాలున్నప్పటికీ ఆయన అనివార్యంగా ఆమె అభ్యర్ధి తత్వాన్నికే మద్దతు తెలపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.మన్యం జిల్లాలో గల నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్వతీపురం తప్ప మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలే పోటీ చేసే అవకాశాలు మెరుగ్గా వున్నాయి. పార్టీ అధినేత అంతరంగంలో ఏముందో శనివారం నాటి తుది జాబితా విడుదలైన తర్వాత తేలిపోనుంది. ఎన్నికల సమరానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో ఆశావహ అభ్యర్ధుల్లో ఉత్కంఠకు అధినేత జగన్‌ ప్రకటనతో తెరపడనుంది.

➡️