పాత పింఛను పునరుద్ధరించే వారికే ఓటు

ప్రజాశక్తి – రాయచోటి పాత పింఛను పునరుద్ధరణకు హామీ ఇచ్చే వారికే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓటు అని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.హరి ప్రసాద్‌, షేక్‌ జాబీర్‌ తెలిపారు. ఆదివారం స్థానిక అలీమాబాద్‌ ఉర్దూ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగిగా జీవితకాలం సేవలు అందించి విరమణ అనంతరం భవిష్యత్తు భద్రత కోసం పోరాడి సాధించుకున్న పెన్షన్‌ను ప్రస్తుత కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వాలు రద్దు చేసి సిపిఎస్‌..జిపిఎస్‌ అంటూ వారి భవిష్యత్తును అంధకారంలో నెట్టే చర్యలకు పాల్పడిందని వాపోయారు. ఎవరైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పింఛను ఇస్తామని వారి మేనిఫెస్టోలో ప్రకటిస్తూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సంతకం చేస్తామని హామీ ఇస్తారో వారికే తమ ఓటు అనే నినాదాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యుడు ప్రసాద్‌, రాయచోటి మండల అధ్యక్షులు హఫీజుల్లా, సహా అధక్షుడు రఫీ, చిన్నమండెం మండలం సహాధ్యక్షుడు కిఫాయతుల్లా, మండల కోశాధికారి ఆదిల్‌, గాలివీడు మండల నాయకులు రియాజ్‌ పాల్గొన్నారు.

➡️