పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నించాలి : పిఒ

Jan 24,2024 22:07

ప్రజాశక్తి -పార్వతీపురం : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌ అన్నారు. బుధవారం స్థానిక గిరిమిత్ర భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహనా కార్యక్రమం విశాఖకు చెందిన ఎంఎస్‌ఎంఇ సంచాలకులు డివిఎస్‌ఆర్‌ మూర్తి ఆధ్వర్యాన జరిగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పిఒ మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశడూ ఐదో స్థానంలో ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తలు పెరగాలన్నారు. పరిశ్రమ పెట్టాలంటే మూలధనం అవసరమని, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి భారత ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశం కలగాలంటే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిఒ సూచించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలు కావాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన వారికి ప్రభుత్వం మొదటి విడతగా 5 శాతం వడ్డీతో లక్ష రూపాయలు బ్యాంక్‌ ద్వారా రుణాన్ని అందజేస్తుందని తెలిపారు. తీసుకున్న రుణాన్ని 18 వాయిదాల్లో తిరిగి బ్యాంక్‌లకు చెల్లించాలని, రెండో విడతగా రూ.2 లక్షల రుణాన్ని అందిస్తుందని వివరించారు. పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ కరుణాకర్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం పనిచేస్తుందన్నారు. 18 రకాల చేతి పనివారు ఉన్నారని, వీరికి ప్రభుత్వం రూ.15వేల విలువైన పనిముట్లను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. డిపిఒ బలివాడ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులందరికీ భారత ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాడానికి తోడ్పాడుతుందన్నారు. జిల్లాలో అర్హత ఉండి ఆర్థికంగా వెనకబడిన వారు సత్వరం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాను మాన్యం జిల్లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జిల్లాలోని ఔత్సాహికవేత్తలకు ఉందన్నారు. డిఆర్‌డిఎ ఎపిడి వై.సత్యం నాయుడు మాట్లాడుతూ చేతివృత్తుల వారిని ప్రోత్సహించేలా ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. నైపుణ్యావృద్ధి సంస్థ జిల్లా అధికారి సాయి కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో సీతంపేట, గుమ్మపురం, సాలూరు, పార్వతీపురంలలో నాలుగు నైపుణ్యాభివద్ది శిక్షణా సంస్థలు ఉన్నాయని తెలిపారు.అక్కడ శిక్షణ తీసుకునే వారికీ ఉచితం వసతి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పధకానికి ఎంపికైన వారికి 5 నుండి 7రోజులు శిక్షణా తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రోత్సాహకంగా రోజుకు రూ.500 భారత ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిఎస్‌సి ప్రెసిడెంట్‌ పి.నాగ కుమార్‌, మహిళలు పాల్గొన్నారు.

➡️