పిటిఎంలో తెలుగు తమ్ముళ్ల రచ్చ

ప్రజాశక్తి-బి.కొత్తకోట తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పిటిఎం మండలంలోని టి.సదుంలో తెలుగుతమ్ముళ్లు రచ్చ చేశారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దాసిరిపల్లి జయచంద్రారెడ్డి కారుపై మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో జయచంద్రారెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. గురువారం టిడిసి విజయ సంకల్ప యాత్రకు నిమిత్తం జయచంద్రారెడ్డి టి.సదుం చేరుకున్నారు. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌ యాదవ్‌ స్వగ్రామం కావడంతో ఆయన వర్గీయులు కాన్వారుపై రాళ్ల దాడి చేశారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో జయచంద్రారెడ్డి అనుచరులు అసనహనం వ్యక్తం చేశారు. టి.సదుంలో టిడిపి విజయ సంకల్ప యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ అంశాన్ని చంద్రబాబు దష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు టికెట్‌ కేటాయించడంతో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. టికెట్‌ వచ్చినా రాకున్నా పార్టీ గెలుపు కోసం పనిచేసే వారే అసలైన తెలుగుదేశం నాయకులని చురకలంటించారు. అనంతరం జయచంద్రారెడ్డి అనుచరులు మాట్లాడుతూ టిడిపి అభ్యర్థి జయచంద్రారెడ్డి కాన్వారుపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పటికైనా ప్రాధాన్యత లభిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టడం లేదని, ఈ అంశాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

➡️