పెన్నాకు నీరొచ్చేనా.. తాగునీటి కష్టాలు తీరేనా..

ప్రజాశక్తి-చెన్నూరు వేసవిని దష్టిలో పెట్టుకొని కడప నగరానికి తాగునీటి సమస్య తీర్చేందుకు వారం రోజుల కిందట మైలవరం జలాశయం నుంచి అధికారులు పెన్నా నదికి నీటిని వదలారు. ఇంతవరకు వల్లూరు మండలం ఆదినిమ్మా యపల్లి పెన్నానదిపై నిర్మించిన ఆనకట్టకు నీరు రాలేదు. సిద్ధవటం మండలం లింగంపల్లి వద్ద కడప నగరానికి తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన పంపింగ్‌ స్కీం వరకు, అలాగే కడప నగరం పరిధిలో పెన్నా నది వాటర్‌ గండి పంపింగ్‌ స్కీం వరకు నీటి సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుతం పెన్నా నది పూర్తిగా ఎండి పోయింది. దీని కారణంగా తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమా దం ఉంది. దీన్ని దష్టిలో పెట్టుకొని మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని వదిలారు. వచ్చిన నీరంతా పెన్నా నదిలో ఇంకిపోతున్నది. పెన్నానది నుంచి ఇష్టానుసారంగా ఇసుక తరలిస్తుండడంతో పెన్నా నదిలో నీటి ప్రవాహం ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పెన్నా నది ఎగువ భాగంలో గండికోట, మైలవరం జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ పెన్నా నదికి ఎక్కువ శాతం నీటిని వదలడం లేదు. కడప నగరానికి తాగునీటి అవసరాల కోసం కర్నూలు జిల్లా బనగానపల్లి సమీపంలో అవుకు రిజర్వాయర్‌లో నీటి నిల్వ ఉంచి అవసరాలకు వదలాల్సి ఉంది. కానీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

➡️