పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యం తగదు

Jan 30,2024 00:26

గుంటూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : పెన్షనర్ల సమస్యలపై సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని స్టేషన్‌ రోడ్డ గాంధీ పార్కు వద్ద ధర్నాచౌక్‌లో ధర్నాలు చేశారు. పల్నాడు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కె.నరసింహారెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించగా పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు పాల్గొని మద్దతుగా మాట్లాడారు. దాదాపు 30 ఏళ్లపాటు ప్రభుత్వ సేవలు అందించిన రిటైర్డ్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. పెన్షనర్ల డిమాండ్లు న్యాయమైనవని, వారి సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్‌ కృషి చేస్తుందని చెప్పారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, పరిష్కారం అయ్యే వరకూ అండగా ఉంటామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృద్ధులైన పెన్షనర్ల సమస్యల పట్ట ప్రభుత్వం కనికరం చూపట్లేదన్నారు. 11వ పిఆర్‌సిలో తగ్గించిన అడిషనల్‌ క్వాంటమ్‌ను తిరిగి గతంలో ఇస్తున్నట్లుగా 70 ఏళ్లు నిండిన వారికి 10శాతం, 75 ఏళ్లు నిండిన వారికి 15 శాతం పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డిఆర్‌ బకాయిలు, 11వ పిఆర్‌సి ఎరియర్లు విడుదల చేయాలని, హెల్త్‌ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకూ వైద్యం అందించాలని, మెడికల్‌ రియంబర్స్‌మెంట్‌ పరిధి రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు, ఎపిఎన్‌జిఒ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.సతీష్‌ ధర్నాకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రభుదాసు మాట్లాడుతూ డిమాండ్ల సాధించుకునే వరకూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5న విజయవాడలో జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ధర్నాలో కోశాధికారి శర్మ, ఎపిఎన్‌జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్‌.నాగూర్‌షరీఫ్‌, ఎపిఎన్‌జిఒ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బి.సాంబిరెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె.జోజయ్య, తదితరులు ప్రసంగించారు.

నరసరావుపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌కు వినతిపత్రం ఇస్తున్న పెన్షనర్లు

నరసరావుపేటలో నిర్వహించిన ధర్నాలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు మానం సుబ్బారావు మాట్లాడారు. పెన్షనర్ల హక్కులను రాష్ట్ర ర్పభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. సిపిఎస్‌ రద్దు చేసి 10 శాతం అదనంగా పెన్షన్‌ ఇవ్వాల్సి ఉండగా కొత్త విధానాలు తెచ్చి కోతలు విధిస్తున్నారని అన్నారు. 2010లో 11వ పీఆర్సీ, డిఆర్‌ అలవెన్సులు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న వైద్య ధరలను అనుసరించి రూ 2 లక్షలకు పరిమితం అయిన మెడికల్‌ అలవెన్సులు రూ.5 లక్షలకు పెంచాలన్నారు. సకాలంలో పెన్షన్‌ ఇవ్వడం లేదని, గౌరవప్రదమైన జీవితాన్ని పెన్షనర్లకు దూరం చేస్తున్నారని విమర్శి ంచారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్య దర్శి ఆదయ్య, కోశాధికారి రాఘవయ్య, సంఘం నాయకులు ఎమ్‌డి హుస్సేన్‌, పి.సుబ్బారావు, పి.రమేష్‌, ఆర్‌.పురుషోత్తం, సీతారామయ్య పాల్గొన్నారు.

➡️