పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే దాక ఉద్యమం

దీక్షలను ప్రారంభించి మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – మంగళగిరి :
ఏన్నో ఏళ్లుగా 20 వేల మంది పేదలు మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నారని, వారందరికీ పట్టాలిచ్చే వరకూ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు, పట్టాల అంశంపై స్థానిక మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఎం చేపట్టిన రిలేదీక్షలు మూడో రోజుకు చేరాయి. కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు అధ్యక్షత వహించారు. సోమవారం దీక్షలను ప్రారంభించిన కృష్ణయ్య మాట్లాడుతూ రియల్టర్ల కు భూములివ్వడాని ల్యాండ్‌ బ్యాంక్‌ చట్టాన్ని తెచ్చిన పాలకులకు పేదలుండే ఇళ్లకు పట్టాలివ్వడానికి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అంర్థం కావడం లేదని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో రూ.కోట్లను ఎమ్మెల్యేలు, మంత్రులు కాజేస్తున్నారని, 20 వేల మందికి సెంటు స్థలం చొప్పున ఇచ్చిన 200 ఎకరాలు, రెండు సెంట్లు ఇస్తే 400 ఎకరాలు కొనాల్సి వస్తుందని, అదే ఉన్నచోట పట్టాలిస్తే రూపాయి ఖర్చు కూడా ఉండదని అన్నారు. ప్రతి పౌరుడికి ఇల్లు, జీవనోపాధి, ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఐక్యరాజ్య సమితి చెబుతోందని, వీటిని ప్రభుత్వాలు అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రతి పౌరుడికి ఇల్లు కల్పించే విషయంలో మనదేశం ప్రపంచంలో 112 స్థానంలో ఉందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని సిఎం జగన్‌ గొప్పలు చెప్పుకోవడమే గాని, పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కాజా, ఆత్మకూరు, ఇంకా వివిధ గ్రామాల్లో అనేక రకాల భూముల్లో ఇల్లు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వడం లేదని అన్నారు. పట్టాలు ఇచ్చేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దీక్షలకు మద్దతుగా సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కె.అజరు కుమార్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, ఎం.పకీరయ్య, యు.దుర్గారావు, వి.వెంకటేశ్వరరావు, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు కె.కోటేశ్వరరావు, సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.లకీëనారాయణ, వై.నేతాజీ తదితరులు మాట్లాడారు. దీక్షలో ఎం.రవి, కె.ప్రకాష్‌రావు, వి.వెంకటేశ్వరరావు, యు.దుర్గారావు, సిహెచ్‌ సీతారామాంజనేయులు, సిహెచ్‌ గిరిధర్‌రావు, జి.నాగేశ్వరరావు, కె.సురేష్‌, ఎం.శ్రీను, జి.లక్ష్మి, కె.సుజాత, టి.శకుంతల, జి.నాగేశ్వరరావు, ఎస్‌.రాధా, కె.శివమ్మ, సిహెచ్‌ దుర్గ, జి.హైమావతి, జి.లీలావతి, ఎ.తనుజ, పి.వెంకటలక్ష్మి, కె.మంగమ్మ, వి.ప్రశాంతి, డి.ఉమా మహేశ్వరి, జి.మాధవరెడ్డి, ఎం.శివయ్య, పి.అప్పారావు, ఎం.అరుణ, ఎ.విజయలక్ష్మి, బి.సత్యమారెడ్డి, ఎస్‌.వెంకటేశ్వరరావు, వీర్లంకయ్య, ఎస్‌.వెంకటనారాయణ కూర్చున్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు పి.బాలకృష్ణ, జిల్లా నాయకులు బి.కోటేశ్వరి, పట్టణ నాయకులు ఎం.బాలాజీ పాల్గొన్నారు.

➡️