పేదల కోసమే సంక్షేమ పథకాలు

Mar 19,2024 22:06
ఫొటో : ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
పేదల కోసమే సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి-ఎఎస్‌పేట : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా, పేదల అభివృద్ధి కోసమే సంక్షేమ పాలన చేపట్టామని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు ప్రజలందరూ ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఎఎస్‌పేట మండలం చౌటభీమవరం, గుడిపాడు, రంగన్నపాడు, అబ్బాసాహెబ్‌ పేట, కొత్తపల్లి గ్రామాల్లో విజయీభవయాత్రను నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎంఎల్‌ఎ మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికీ వద్దకు వెళ్లి ప్రభుత్వం నుంచి వారికి అందిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ జగనన్న ఆశీర్వదించాలని కోరుతూ విజయీభయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రలాపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వారే ముందుకు వచ్చి ఘన స్వాగతం పలుకుతూ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెబుతుండడం ఆనందాన్ని కలిగించిందన్నారు. గత ఐదు సంవత్సరాలలో ప్రతి సామాజిక వర్గం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఆ అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలను ఓటు అడిగే హక్కు వైసిపికే ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం చేశారో వివరించి అప్పుడు ఓట్లు అడగాలన్నారు. దళారులతో పనిలేకుండా నేరుగా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందేలా చేసిన మొట్టమొదటి నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని, దేశంలో ఇంత మంచి పద్ధతి క్కడా లేదన్నారు. జగనన్న అందించిన సంక్షేమాన్ని చూసిన ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని, ఇప్పటి వరకు సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా ముఖ్యమంత్రి పనిచేశారని, ఎన్నికల్లో వైసిపిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల కాలంలో చౌటభీమవరం, గుడిపాడు పంచాయతీలలోని ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమాభివృద్ధి కోసం రూ.35 కోట్ల వరకు అందజేసినట్లు వివరించారు. చౌటభీమవరంలో డిబిటి, నాన్‌ డిబిటి పథకాల రూ.15.36కోట్లు అందజేసినట్లు, వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా 12 బోర్లు ఏర్పాటు చేశామని వివరించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 12 అభివృద్ధి పనుల కోసం రూ.40లక్షలు అందించినట్లు, 409మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం ఇంత భారీస్థాయిలో ఏనాడు నిధులు అందజేయలేదన్నారు. గుడిపాడు పంచాయతీలో సంక్షేమాభివృద్ధి కోసం రూ.14.07కోట్లు అందజేశామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.40లక్షలు అందజేశామన్నారు. 21 బోర్ల ఏర్పాటు ద్వారా రూ.14.70 లక్షలు అందచేశామని తెలిపారు. 209మంది రైతుల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఆయా గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకోచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. సోమశిల ఉత్తరకాలువ నుండి పిడబ్య్లూడి చెరువుకు లిఫ్డ్‌ ఇరిగేషన్‌, భూమి లేని పేదలకు భూపంపిణీతో పాటు తారురోడ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు కోరిన విధంగా ఆర్‌ఒ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి టి.పందిల్లపల్లి రాజేశ్వరమ్మ, ఎంపిపి పద్మజ రెడ్డి, పందిపాడు వైసిపి నాయకులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ పండిల్లపల్లి సుబ్బారెడ్డి, కన్వీనర్‌ రమేష్‌ రెడ్డి, కోఆప్షన్‌ సంధాని, యువజన నాయకుడు షౌకత్‌, శ్రీనివాసుల రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️