పోరాడతాం.. సాధించి తీరతాం..

Jan 14,2024 00:08
ప్రభుత్వం ఎంతటి నిర్బంధాన్ని

ప్రజాశక్తి – యంత్రాంగం

ప్రభుత్వం ఎంతటి నిర్బంధాన్ని ప్రయోగించినా..ఎన్ని బెదిరింపులకు గురిచేసినా తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు పోరాడుతాం..హక్కులను సాధించితీరుతాం అంటూ అంగన్‌వాడీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అంగన్‌వాడీల నిరవధిక సమ్మె శనివారం నాటికి 33వ రోజుకు చేరింది. పండగైనా..పబ్బమైనా అన్నీ నిరసన శిబిరాల్లోనే అంటూ అంగన్‌వాడీలు సంక్రాంతిని పురష్కరించుకుని శనివారం నిరసన శిబిరాల వద్ద తమ డిమాండ్లు ప్రతిబింబించేలా ముగ్గులను వేసి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేశారు.

కాకినాడ స్థానిక కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద జరుగుతున్న నిరసన శిబిరం వద్ద సంక్రాంతిని పురష్కరించుకుని ముగ్గులను వేశారు. ఆ ముగ్గుల్లో తమ డిమాండ్లను ప్రతిబింభించేలా వేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి మాట్లాడుతూ మంత్రుల బృందంతో జరిగిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయని తెలిపారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం వేతనాలు పెంచలేమని పాత పాటనే పాడిందని, అలాంటప్పుడు చర్చలకు ఎందుకు పిలిచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జులైలో వేతనాలు పెంచుతామని, అయితే ఎంత పెంచుతామో చెప్పలేమని, ఉత్తర్యులు కూడా ఇప్పుడు ఇవ్వలేమని మంత్రుల బృందంచెప్పడంతోనే సమ్మెను యథాతధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిత్యం అన్నింటి ధరలను పెంచుతూ పాలన సాగిస్తున్న ప్రభుత్వం అంగన్‌వాడీలకు మాత్రం ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వేతనాలు పెంచుతామనడం సిగ్గుచేటన్నారు. వేతనాలు పెంచేంతవరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నాయకులు రామా, వీరవేణి, మున్నీ, చామంతి, విజయ, శ్రీదేవి, అర్బన్‌, రూరల్‌ అంగన్‌వాడీలు, ఆయాలు సమ్మే సిబిరంలో కూర్చున్నారు.

పిఠాపురం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు డి.పద్మావతి, సిఐటియు నాయకులు కె.చిన్న మాట్లాడుతూ చర్చల పేరుతో మంత్రుల బృందం పిలిచి బెదిరింపులకు పాల్పడుతుందని దుయ్యబటారు. నాలుగు నెలల తరువాత తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు జీతాలను పెంచుతామనడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు విజయశాంత, వి వెంకటలక్ష్మి, నళిని, ప్రజావాణి, బేబీరాణి, బి.వెంకటలక్ష్మి, రామలక్ష్మి, అమల, రాఘవమ్మపాల్గొన్నారు.

జగ్గంపేట రూరల్‌ స్థానిక పంచాయతి రాజ్‌ అతిధి గృహం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె వద్ద అంగన్‌వాడీలు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం ఇవ్వాలని, జీవో 2 ను రద్దు చేయాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సుజాత, రాజేశ్వరి, రామ్‌ లీలా ఉన్నారు .

పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్‌ వద్ద జరుగుతున్న నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు సంక్రాంతిని పురష్కరించుకుని రోడ్డుపై ముగ్గులు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు దాడి బేబీ మాట్లాడుతూ చర్చల పేరుతో ప్రభుత్వం అంగన్‌వాడీల జీవితాలతో ఆటలాడుకుంటుందని అన్నారు. చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. ఈ నెల 14 నుంచి జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి ఇంటి నుంచి సంతకాలు సేకరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.క్రాంతికుమార్‌, నీలపాల సూరిబాబు, యూనియన్‌ నాయకులు బేబీ, నాగమణి, అమల, ఎస్తేరురాణి, బాలం లక్ష్మి, టిఎల్‌.పద్మావతి, లోవతల్లి పాల్గొన్నారు.

కరప స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తన మనవుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న గురజనాపల్లికి చెందిన అంగన్‌వాడీ ఆయా మంగ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆయాను సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, అంగన్‌వాడీ ఊనియన్‌ నాయకులు ఎం.వీరవేణి, ఎస్‌ వరలక్ష్మి, జిఎకెఎల్‌.నారాయణమ్మ, ఎం.భవాని, అచ్చరత్నం పరామర్శించారు.

➡️