ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు ప్రాముఖ్యత ఎక్కువ

Feb 11,2024 20:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి : ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు ప్రాముఖ్యత చాలా ఎక్కువని రైతు సాధికార సంస్థ సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ డి.పారినాయుడు అన్నారు. మండలంలో తోటపల్లి నూతన జట్టు ట్రస్ట్‌ కార్యాలయంలో ఆదివారం బడి నుండి పొలం బడికి పాఠ్యాంశాల రూపకల్పనలో భాగంగా రచయితల వర్క్‌ షాప్‌ పారినాయుడు అధ్యక్షతన జరిగింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ మార్గదర్శకాల ప్రకారం రెండో తరగతి విద్యార్థులకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఆదివాం ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు – ప్రాముఖ్యత పై ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు రౌతు వాసుదేవరావు రాసిన గేయాలు, కథలను ముందుగా సమీక్షించారు. ఆవు, దాని ఉత్పత్తులు, వాటి ఉప ఉత్పత్తులు, వ్యవసాయంలో వాటి ఆవశ్యకత, వినియోగంపై రాసిన గేయాలను, కథలను ఎన్‌సిఆర్‌టి మార్గదర్శకాలకు అనుగుణంగా సరళమైన భాషలో, అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా అవసరమని అన్నారు. ఈ మేరకు ఇతర రచయితల అభిప్రాయాలను తీసుకుని సవరణలు చేశామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో అన్ని రకాల పోషకాలు అందివ్వడం, వివిధ రకాల ఎరువులు, కశాయాల తయారీలో ఆవు, ఆవు యొక్క వివిధ ఉత్పత్తుల ప్రాధాన్యత చాలా ఉందని అన్నారు. ఇది అన్ని ప్రాంతాల, అన్ని వయస్సుల వారికి ఉపయోగ పడుతుందని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బెలగాం భీమేశ్వరరావు మట్టి రకాలు, నీటి వనరులు, దేశీ విత్తనాలు అన్న అంశాలపై రాసిన గేయాలు, కథలను సమీక్షించామని, బాల సాహిత్యంలో విశేష అనుభవం గల భీమేశ్వర రావు సరళమైన భాషలో అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా పద ప్రయోగం చేసి రాసిన ఈ పాఠ్యాంశాలు రెండో తరగతి విద్యార్థులకు అనువుగా ఉన్నాయని అన్నారు. 10 మంది రచయితల సమక్షంలో సమీక్షించడం వల్ల సారాంశంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడగలుగుతున్నామని పారి నాయుడు తెలిపారు. భావితరాలకు, బాలలకు ఈ పాఠ్యాం శాలు చాలా ఉపకరిస్తాయని, వారు తినే ఆహారం ఎలా వస్తుందో తెలుసుకునే అవకాశం బాల్యంలోనే కలుగుతుందని అన్నారు. ఇలా తెలుసుకోవడం ద్వారా వారి నైపుణ్యాలు పెరిగి సురక్షితమైన ఆహార ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. తద్వారా భవిష్యత్‌లో ఆహార కొరత ఏర్పడకుండా చేయగలదని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అన్నారు. బడి నుండి పొలం బడికి సిలబస్‌ డెవలప్మెంట్‌ కన్సల్టెంట్‌ తుంబలి శివాజీ ఈ గేయాలకు, కథలకు అనువైన చిత్రాలను గీసి ఆకర్షణ కల్పించారు. కార్యక్రమంలో రౌతు వాసుదేవరావు, బెలగాం భీమేశ్వర రావు, తుంబలి శివాజీ, బెహరా ఉమామహేశ్వరరావు, పక్కి రవీంద్ర నాథ్‌, లంకా వెంకట స్వామి, ద్వారపు రెడ్డి దనుంజయరావు, శ్రీరామచంద్ర మూర్తి, కిలపర్తి దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️