ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి

Dec 9,2023 21:40

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  మండలంలోని గొరడలో శనివారం వల్లాడ, పెంగవ, రాయగడ జమ్ము, గొరడ గ్రామాలకు చెందిన జీవ రైతుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయగడ జమ్ము సర్పంచి పత్తిక అమల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గిపోవడం, ఆరోగ్యాలు క్షీణించడం, సకాలంలో ఋతువులు రాకపోవడం, పని చేయడానికి అనాసక్తిగా కలగడం తదితర లక్షణాలు ఎక్కువమందిలో కనిపిస్తున్నాయన్నారు. ఇందుకు కారణం రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఉపయోగించి పండించిన ఆహార పదార్థాలు తినడం వల్ల అలాంటి సమస్యలతో సతమతమవుతుండడం జరుగుతుంద న్నారు. వీటన్నింటికీ ఒకే ఒక పరిష్కారం ప్రకృతి వ్యవసాయం చేయడమేనని తెలిపారు. నాబార్డు ద్వారా ఈ ప్రాంతంలో జీవా కార్యక్రమం అమలు చేయడం సంతోషదాయకమన్నారు. ఆర్‌.జమ్ము పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామాల్లో నాబార్డు సహకారంతో జట్టు సంస్థ పర్యవేక్షణలో జీవ పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం నిజంగా ఆనందించదగ్గ విషయమని, రైతులు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేయడం ద్వారా త్వరితగతిగా అభివృద్ధి చెందుతారని అన్నారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ కమిటీ అధ్యక్షులు తాడంగి జమ్మయ్య మాట్లాడుతూ గిరిజనులు పూర్వం కాలం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలను వ్యవసాయ రంగంలో ఆచరించాలని సహజంగా లభించే వనరులను ఉపయోగించుకోవడం వల్ల భూమిని సారవంతం చేసుకుంటే పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పశుసంపద ప్రతి ఇంటిలో ఉండాలని అప్పుడే కుటుంబాలతో పాటు, క్షేత్రాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రిసోర్స్‌పర్సన్‌ నూకం నాయుడు జీడి, మామిడిలో దిగుబడి పెరిగేందుకు చేపట్టే ప్రకృతి సాగు విధానాలు, రబీలో చేపట్టే సస్యరక్షణ కార్యక్రమాలు, నేలను సారం చేసే విధానాలు, పలు పంటలు, అంతర పంటలు, డ్రై సోయింగ్‌, వివిధ పంటల నమూనాలు సాగు మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మానిటరింగ్‌ కమిటీ అధ్యక్షులు టి.జమ్మయ్య, కార్యదర్శి కె.చిరంజీవి, జీవా కో-ఆర్డినేటర్‌ జి.ప్రొబోద్‌, ఆది తల్లి సిఇఒ పేకాపు మురళి, కోఆర్డినేటర్‌ జి.మురళీమోహన్‌, ఎస్‌సిఆర్‌పి యశోదా దేవి, విడిసి అధ్యక్షులు పువ్వుల గౌరయ్య, జీవా రైతులు, తదితరులు పాల్గొన్నారు.

➡️