ప్రజల్ని మోసం చేస్తున్న బిజెపి

Feb 7,2024 00:04

 గ్రామీణ బంద్‌ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న వివిధ సంఘాల నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల నాటి హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విస్మరించి ప్రజల్ని మోసం చేస్తోందని, పైగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కుట్రలు చేస్తోందని వివిధ సంఘాల నాయకులు విమర్శించారు. 16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె జయప్రదం కోసం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో ఉన్న సిపిఎం కార్యాలయంలో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మె కరపత్రం ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్‌లు తెచ్చిందని మండిపడ్డారు. రైతు ఉద్యమానికి తలవంచి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినా వాటిని దొడ్డిదారిన అమలు చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలుచ్చి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పేరుతో పన్నులు పెంచుతున్నారని మండిపడ్డారు. బిజెపి పాలనలో దేశవ్యాప్తంగా 1.50 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసాన్ని విస్మరించిందని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు కుట్రలు పనుతోందన్నారు. నానాటికి సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడాలన్నా, వ్యవసాయం రైతులకు లాభసాటి కావాలన్నా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కేరళ రాష్ట్ర తరహాలో ఆంధ్ర రాష్ట్ర రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి రుణ ఉపశమన చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు నిధులు కేటాయించి ఏడాదికి 200 రోజులకు పని దినాలు, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు ఆహార భద్రత చట్టాన్ని పటిష్టం చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించి స్మార్ట్‌ మీటర్ల బిగింపు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపు ఆపాలని కోరారు. బంద్‌, సమ్మె జయప్రదం కోసం 10వ తేదీనాటికి అన్ని నియోజకవర్గాలలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాలని, 13, 14 తేదీల్లో ప్రచారం, 16న పట్టణ, మండల కేంద్రాల్లో ఎద్దుల బండి, ట్రాక్టర్లతో ప్రదర్శనలు చేయాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కార్యదర్శుల కె.రామారావు, వై.రాధాకృష్ణ, ఆలిండియా కిసాన్‌ సభ రాష్ట్ర నాయకులు టి.ఆంజనేయులు, భాస్కర్‌, వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, పిడిఎం జిల్లా నాయకులు మస్తాన్‌వలి, ఎన్‌.రామారావు కెఎన్‌పిఎస్‌ నాయకులు కృష్ణ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు కె.ఏడుకొండలు, ఎఐటియుసి నాయకులు రంగయ్య, ఎబిఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.అంజమ్మ, భారత్‌ బచావో నాయకులు వి.కోటనాయక్‌ పాల్గొన్నారు

➡️