ప్రజల నుండి సిపిఎం విరాళాల సేకరణ

Feb 2,2024 00:06

ప్రజాశక్తి – చిలకలూరిపేట : ప్రజల సమస్య పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేసే సిపిఎంకు అండగా నిలవాలని, విరాళాలిచ్చి తోడ్పాటు అందించాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు పట్టణంలో గురువారం ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిత్యం ఉద్యమిస్తోందన్నారు. సామాన్య ప్రజల బాగు కోసం, రాష్ట్ర అభివద్ధి కోసం నిజాయితీగా, నిస్వార్ధంగా పాటుపడుతోందని చెప్పారు. పరుగుతున్న ధరలతో, తరుగుతున్న ఆదాయాలతో, నిరుద్యోగంతో సామాన్యులు సతమతమవుతున్నారని, విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించారని చెప్పారు. ఈ దశలో కష్టనష్టాల్లో ఉన్న ప్రజల కోసం సిపిఎం అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఈ పోరాటాలు, ఉద్యమాలు మరింతగా నిర్వహించేందుకు ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. పదో తేదీ వరకూ విరాళాలు సేకరిస్తామని, ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బి.శంకర్రావు, ఎస్‌.లూథర్‌, ఎం.విల్సన్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – అమరావతి : సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి బి.సూరిబాబు, ఇతర కార్యకర్తలు కలిసి దుకాణాలు, ప్రధాన వీధిలో విరాళాలు సేకరించారు. సూరిబాబు మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సిపిఎం నిత్యం పోరాడుతోందని చెప్పారు. కార్యక్రమంలో సయ్యద్‌ మోదిన్‌ వలి, నండూరి రాజు పాల్గొన్నారు.

➡️