ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక మీడియాపై దాడులు

Feb 19,2024 21:31

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసిపి నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పార్వతీపురంమన్యం జిల్లా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ విలేకరుల సంఘం నాయకులు అన్నారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసి, అనంతరం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సంఘటనలు అక్షర బద్ధం చేయడం, ఫోటోలో బంధించడం వారి విధుల్లో ముఖ్య భాగమని, ప్రజాస్వామ్య విలువలను కాలరాసే రాజకీయ పార్టీలపై సహజంగానే ప్రజలు యావగించుకుంటారని, దీన్ని హుందాగా రాజకీయ పార్టీలు స్వీకరించలేక విలేకరులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా విలేకరులపై భౌతిక దాడులకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకోవా లని, ఇప్పటికే వారి రక్షణ కోసం ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, బాధిత జర్నలిస్ట్‌ కృష్ణను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.సాలూరు: అనంతపురం జిల్లా రాప్తాడులో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు పై దాడిని ఖండిస్తూ స్థానిక ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు మండల తహశీల్దార్‌ కార్యాలయంలో హెచ్‌డిటి రంగారావుకు వినతిపత్రం అందజేశారు. వార్తా సేకరణలో భాగంగా ఫొటోలు తీస్తున్న జర్నలిస్టుపై విచక్షణారహితంగా సామూహిక దాడి చేయడం అన్యాయమని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.పాచిపెంట : అనంతపురం జిల్లా రాప్తాడులో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని నిరసిస్తూ మండల విలేకరులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ జె ఉదరు కుమార్‌కు వినతిని అందజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు సిహెచ్‌ వెంకటరమణ, జి.వెంకట రాజు, నల్లి గోవిందరావు, వై.గౌరీశ్వరరావు, ఎ.రమేష్‌, పి.వెంకటరమణ, పి.ఉమామహేశ్వ రరావు, ఎస్‌ఆర్‌టిపి రాజు, ఎల్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సిపిఎం ఖండనపార్వతీపురంరూరల్‌ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కష్ణపై వైసిపి కార్యకర్తల దాడిని ఖండిస్తున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.. జర్నలిస్టు ఫొటోలు తీయడం నిషిద్ధమా, నేరమా అని నిలదీశారు. ఇది మీడియాపై అధికార పక్షం చేసిన ఫ్యాక్షన్‌ దాడి అని మండిపడ్డారు. ఒక పత్రిక, ఛానెల్‌ యజమాని అయిన సిఎం ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, తగదని అన్నారు.

➡️