ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

Jan 20,2024 23:54
గత 40 రోజులుగా

ప్రజాశక్తి – యంత్రాంగం

గత 40 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలకు మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో జరిగింది. జిల్లా కేంద్రమైన కాకినాడతోపాటు, జిల్లాలోని మండల, డివిజన్‌ కేంద్రాల్లో కేంద్ర కార్మిక సంఘాలతోపాటు, ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష వైఖరిని తప్పుపట్టాయి.

కాకినాడ స్థానిక ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాడ్యూటీని అమలు చేయాలని, ఇప్పటి వరకూ ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లకు జిఒలను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెక్కా రమణీ మాట్లాడుతూ లక్ష మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు తీరని అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మహిళా పక్షపాతిగా సేవలందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. ఒక్కరోజు భోగి మండపం నిర్మాణానికి రూ.2 కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల ప్రాయంగా ఖర్చుచేసిన ముఖ్యమంత్రి అంగన్‌వాడీల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 33 మంది సలహాదారులకు నెలకు రూ.3.50 లక్షలు చొప్పున వేతనాలు చెల్లించేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఎంఎల్‌ఎ, ఎంపీల వేతనాలను రూ.50 వేల నుంచి రూ. 4 లక్షలకు పెంచుకుని, అట్టడుగున ప్రజలకు నేరుగా సేవ చేసే అంగన్‌ వాడీలకు వేతనాలు పెంచలేమని మంత్రులు చెప్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఐదేళ్ల కాలంలో విద్యుత్‌ ఛార్జీలు 14 సార్లు, పెట్రోలు డీజిల్‌ ధరలు 22 సార్లు పెంచిన ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల వేతనాలను ఎందుకు పెంచరని ప్రజల ప్రశ్నలకు సమా ధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, రూరల్‌ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, టి. రాజా, ఐద్వా నాయకురాలు భవాని, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌ నాయకులు స్వామి, వెంకన్న, జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు విజరు కుమార్‌, మెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కృష్ణ, ఎఐసిసిటియు నాయకులు నరసరాజు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంగన్‌వాడీలు రాస్తా రోకో నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్క రించేంతవరకు సమ్మె విర మించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్య కమంలో యూనియన్‌ ఉపా ధ్యక్షురాలు టి. నాగ సత్య, ప్రధాన కార్యదర్శి అల్లాడి లక్ష్మీ, కోశాధికారి కాసురి హేమ లత తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం స్థానిక ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్క రించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్య కర్తలు ఎన్‌.అమలావతి, సిహెచ్‌.వెంకటలక్ష్మి, జె.రాణి, పి.నూక రత్నం, ఆర్‌.రత్నకుమారి, పి.దుర్గాసూర్యకుమారి, కె.రమ్య, పి.గంగా భవాని, కె.బంగారుపాప, బి.కృపావతి పాల్గొన్నారు.

పెద్దాపురం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ విజయవాడలో అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయన్నారు. మహిళలు 40 రోజులుగా తమ సమస్యల పరిష్కారం చేయాలని రోడ్డు మీద ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ టియు నాయకులు గడిగట్ల సత్తిబాబు, మాగాపు నాగు, రేలంగి వెంకట రావు, పెంటయ్య, నీల పాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్‌, ప్రజా నాట్యమండలి నాయకులు రొంగల వీర్రాజు, దారపు రెడ్డి సత్యనారాయణ, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు అమలావతి, ఫాతిమా, స్నేహలత, మహాలక్ష్మి, మంగాలక్ష్మి, సూర్య కుమారి, తదితరులు పాల్గొన్నారు.

జగ్గంపేట రూరల్‌ స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన శిబిరాన్ని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మరోతి శివగణేష్‌ సందర్శించి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీల డిమాండ్లను పెట్టిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి, జగ్గంపేట మండలాలకు చెందిన యూనియన్‌ నాయకులు సుజాత, రాజేశ్వరి, గంగాభవాని, రామ్‌లీలా, తదితరులు నాయకత్వం వహించారు.

పిఠాపురం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్ష శిబిరాన్ని సిపిఎం, ఇతర ప్రజా సంఘాల నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. అంగన్‌వాడీల డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపచేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అంగన్‌వాడీల సమ్మెలో సిపిఎం, ప్రజా సంఘాలు ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోనేటి రాజు, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కరణం విశ్వనాథం, కుంచె చిన్న, ప్రజా సంఘాల నాయకులు వీరబాబు మోహనాచార్యులు, సూర్యచక్రం, ఎ రాజు, యూనియన్‌ నాయకులు విజయశాంత, నళిని, వెంకటలక్ష్మి, సూర్యకాంతం, రాఘవ, నాగ గన్నిక, దుర్గ, భవాని తదితరులు పాల్గొన్నారు.

కిర్లంపూడి స్థానికంగా జరుగుతున్న నిరసన శిబిరం సమీపంలో అంగన్‌వాడీలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని, ప్రభుత్వం చేసే బెదిరింపులకు లొంగేది లేదని అన్నారు. వేతనాలు పెంచేవరకూ తమ సమ్మెను విరమించేది లేదని తేల్చిచెప్పారు.

కరప గత 40 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో వివిధ కారణాలతో మృతి చెందిన అంగన్‌వాడీలకు సంతాపంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ శిబిరాన్ని సిపిఎం జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌, ఐద్వా నాయకురాలు సిహెచ్‌ రమణీ సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవకుమారి, అచ్చారత్నం, కల్పలత, తదితరులు పాల్గొన్నారు.

➡️