ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని రోటరీ హాలు ప్రాంగణంలో సిపిఎం జిల్లా విస్తృస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి, మంతెన సీతారాం మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో, ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పథకాల హామీలతో సిగ్గు లేకుండా ప్రజలను మోసం చేసేందుకు ప్రకటనలు, మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ కార్పొరేట్‌ ప్రయివేటు సంస్థలకు తాకట్టు పెడుతుందని దేశం మొత్తాన్ని అంబానీ, ఆదానీలకు కట్టబెడుతోందని, 75 సంవత్సరాల దేశప్రజల సంపదను కారు చౌకగా అమ్మడానికి చూస్తుందని విమర్శించారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయని పేర్కొన్నారు. అలాగే సిఎం జగన్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరానికి ప్యాకేజీ తీసుకొస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా తిరిగి బిజెపి ప్రభుత్వానికి సిఎం జగన్‌ వత్తాసు పలుకుతున్నారని, వీరి అధికారం, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెట్టడం దుర్మార్గమన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివద్ధి కోరుకుంటే బిజెపికి మద్దతు ఇవ్వడం ఆపి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని, బిజెపిని ఎండకట్టాలని హితవు పలికారు. అందుకోసమే ఈనెల 28, 29, 30 తేదీల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఏలూరులో జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించి బిజెపిని ఒంటరిని చేసేందుకు ప్రజల్లోకి ముందుకెళ్తామని, అందుకోసం ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నాగమణి, పి.కిషోర్‌, ఆర్‌.లింగరాజు, కె.రాజు, జిల్లా కమిటీ సభ్యులు తెల్లం దుర్గారావు, కె.శ్రీనివాస్‌, ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ, టి.ముత్యాలమ్మ, వై.నాగేంద్రరావు, జి.వెంకట్రావు పాల్గొన్నారు.

➡️