ప్రజా ఉద్యమాలకు విరాళాలు ఇవ్వండి

Feb 11,2024 20:03

 ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రజా సమస్యలపై సిపిఎం నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలకు విరాళాలిచ్చి అండగా నిలవాలని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు కోరారు. పట్టణంలో ఆదివారం సిపిఎం నాయకులు విరాళాలు సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు, కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిపిఎం నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలు పెరగడంతో అన్ని వర్గాల ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. ఆస్తిపన్ను, చెత్తపన్ను వంటి భారాలు వేస్తున్నారన్నారు. అన్ని రంగాల సమస్యలు పరిష్కారానికి సిపిఎం నిరంతరం పని చేస్తోందన్నారు. కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే ఎలక్ట్రోల్‌ బాండ్లను తీసుకోకూడదని సిపిఎం తీర్మానం చేసి ఎన్నికల కమిషన్‌కు కూడా తెలియజేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై పని చేస్తున్న సిపిఎంకు ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారాలు స్వచ్చందంగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.శంకరరావు, బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి మండలాల కార్యదర్శులు ఎస్‌.గోపాలం, బలస శ్రీనివాసరావు, సురేష్‌ పాల్గొన్నారు.

ప్ర్రజా పోరాటాలను బలపర్చండి

నెల్లిమర్ల : సిపిఎం నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలను ప్రజలంతా బలపర్చాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. జరజాపు పేటలో సిపిఎం పార్టీ నిధుల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక, కర్షక, ఉద్యోగుల, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ, సిపిఎం నాయకులు టివి రమణ, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️