ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

Mar 15,2024 20:22

 ప్రజాశక్తి-విజయనగరం : వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ మీదుగా కోట జంక్షన్‌ వరకు శుక్రవారం నిర్వహించిన మోటార్‌ సైకిల్‌ ర్యాలీని, కలెక్టరేట్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యం చేసే ఉద్దేశంతో వివిధ రకాల అవగాహనా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఇప్పటికే మొదటి విడత స్వీప్‌ కార్యక్రమం పూర్తి అయ్యిందన్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు నివసించే ప్రాంతాలు, సంతలు, మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, ఓటుహక్కు వినియోగించే విషయంలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇటీవలే ఓటుహక్కు పొందిన యువ ఓటర్లను ఉత్సాహ పరిచే కార్యక్రమంలో భాగంగా ఈ మోటార్‌ సైకిల్‌ ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి, అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు, స్వీప్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, తాహశీల్దార్‌ ఎవి రత్నం, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు, యువ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️