ప్రతి సమస్యకూ సత్వర పరిష్కారం

Dec 11,2023 16:38
అర్జీలను స్వీకరిస్తున్న

ప్రజాశక్తి – కాకినాడ

ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావు అన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలకు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన, కోర్టు సంబంధ అంశాలు మినహా మిగిలిన సమస్యలను ఎప్పటికప్పుడు నిర్దేశించిన వ్యవధిలో పరిష్కరించాలన్నారు. గత నవంబర్‌ నెలలో 40 ఫిర్యాదులు రాగా, వాటిలో 27 ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించామన్నారు. మిగిలిన సమస్యలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. డయల్‌ యువర్‌ కమిషనర్‌కు అంతరాయండయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి సోమవారం అంతరాయం కలిగింది. సాంకేతిక పరమైన ఇబ్బంది కారణంగా ఫోన్లు పని చేయకపోవడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించలేకపోయారు. ఈ సమస్యను పరిష్కరించి వచ్చే సోమవారం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కమిషనర్‌ నాగ నరసింహారావు అధికారుల ఆదేశించారు. డయల్‌ యువర్‌ కమిషనర్‌, స్పందన కార్యక్రమాలతోపాటు ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశామని కమిషనర్‌ నాగ నరసింహారావు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 4255 990 కు కాల్‌ చేసి స్థానికంగా ఎదుర్కొనే సమస్యలను వివరించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ పి.సత్య కుమారి, డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, ఇఇలు మాధవి, వెంకటరావు, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ పృథ్విచరణ్‌, డిసిపి హరిదాసు, ఎసిపి నాగశాస్త్రులు, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, టిపిఆర్‌ఓ మానే కృష్ణమోహన్‌, వివిధ విభాగాతిపతులు పాల్గొన్నారు.

➡️