ప్రభుత్వం దిగొచ్చేవరకూ పోరు..!

ప్రజశక్తి – యంత్రాంగం’

ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. గత పదిరోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించకపోగా బెదిరింపులకు పాల్పడుతూ, అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలుకొట్టి సచివాలయ సిబ్బందితో నిర్వహించాలని చూడటం సిగ్గుచేటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమ్మె గురువారానికి పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ మానవహారాలు నిర్వహించి నిరసన తెలిపారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వీరికి వివిధ కార్మిక, ప్రజాసంఘాల, రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. లింగపాలెం : అంగన్‌వాడీలకు కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సమ్మెకు కార్మిక, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయపార్టీలు, అభ్యుదయ ప్రజాస్వామ్య వాదుల మద్దతు రోజురోజుకీ పెరుగుతుందన్నారు. బిజెపి పేదరికం, చిన్నారుల్లో పోషకాహారలోపం, ఆకలి వంటి సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యంచేసి ఐసిడిఎస్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించిందన్నారు. పెరుగుతున్న ధరలతో ఇది ఏ మాత్రమూ సరిపోదని, ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను ఎలా నడపాలని ప్రశ్నించారు. ఆకలి మరణాల సూచిలో మన దేశం 107వ స్థానంలో ఉందని, దీనినుండి బయటపడటానికి లబ్ధిదారులకు మెరుగైన ఆహారం అందించే దిశగా బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లను కుదించడానికి నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చి సెంటర్లను మెర్జ్‌ చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. లబ్ధిదారులను కుదించటానికి పోషణ ట్రాక్‌ యాప్‌ను తీసుకువచ్చిందన్నారు. 48 ఏళ్ల నుంచి గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అనేక సేవలందిస్తున్న అంగన్‌వాడీలకు కనీసం, ఉద్యోగ భద్రత లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. అనేక రకాల యాప్‌లు తెచ్చి అంగన్‌వాడీలపూ పనిభారం మోపారని మండిపడ్డారు. సెంటర్ల బలోపేతానికి అవసరమైన నిధులు కేటాయించకుండా లబ్ధిదారులకు నాశిరకం సరుకులను సరఫరా చేస్తున్నారన్నారు. నూతనంగా గర్భిణులకు, బాలింతలకు ఫేస్‌యాప్‌ తీసుకొచ్చారన్నారు. ఫోన్లు పనిచేయకపోయినా, నెట్‌ సిగల్‌ లేకపోయినా అమలు చేయాలని అధికారులు అంగన్వాడీలను మానసిక వేదింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు డి.దాస్‌, జ్యోతి, అంగన్వాడీల సంఘం నాయకులు బిజెఎన్‌.కుమారి, ఈశ్వరి, మేరీ, మార్తమ్మ, రజని, మల్లేశ్వరి పాల్గొన్నారు. ఏలూరు అర్బన్‌:అంగన్వాడీలు పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎల్‌ఐసి ఏజెంట్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి గొట్టాపు రవికిషోర్‌ తెలిపారు. అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ చేపట్టిన సమ్మె పదో రోజుకి చేరింది. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రవికిషోర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి, సెంటర్లను స్వాధీనం చేసుకుని అధికారులు నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. సిఎం జగన్‌ సానుకూలంగా ఆలోచించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ధర్నా శిబిరం నుంచి ఫైర్‌ స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కిషోర్‌, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి.సాయిబాబు మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎన్నికల ముందు వైసిపి అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని హామీ ఇచ్చారని ఐదేళ్లు గడిచిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు టి.రజనీ, నాయకులు అరుణకుమారి రెడ్డి, రామలక్ష్మి, స్వప్న, నవతి సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు, ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు కనకారావు, చంద్రశేఖర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.పెదపాడు : మండలంలో అంగన్‌వాడీల సమ్మె పదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక బండ్ల తూము సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. తొలుత అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పెదపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎస్‌.తిరుపతమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షురాలు కె.శారద, నాయకులు సీతామహాలక్ష్మి, శ్రీకుమారి, దుర్గ, దేవమణి, వినీల, నాగలక్ష్మి, శివలీల పాల్గొన్నారు. సిపిఎం నాయకులు గుండపనేని సురేష్‌, షేక్‌ కరీముల్లా సమ్మెకు మద్దతు ప్రకటించారు. భీమడోలు : అంగన్వాడీల నిరవధిక సమ్మె మండలంలో పదో రోజు కొనసాగింది. స్థానిక సాయిబాబా ఆలయ సమీపంలో ఏర్పాటుచేసిన శిబిరాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ నాయకులు స్వర్ణ కుమారి, చెల్లామణి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 64 అంగన్వాడీ కేంద్రాల అంగన్‌వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.నిడమర్రు : మండలంలోన అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ శేఖర్‌కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు వంగూరు శివరామలక్ష్మి, పి.సునీత, ఆల్తి భవాని, భలే సుమతి, గొల్ల దివ్య, మిద్దె జీవనజ్యోతి పాల్గొన్నారు.చింతలపూడి : విశాఖలో సిఎం ప్యాలెస్‌ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చయిందని, కానీ అంగన్వాడీల వేతనాల పెంపునకు ఏడాది బడ్జెట్‌ అంత కూడా అవ్వదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరింది. ఈ క్రమంలో వైసిపి నేత శిబిరం వద్దకు చేరుకుని దురుసుగా వ్యవరించడంతో అంగన్వాడీలు తీవ్రంగా ఖండించారు. క్షమపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫైర్‌స్టేషన్‌ వద్ద మానవహారంగా నిలబడి నినాదాలు చేశారు. అనంతరం రవి మాట్లాడుతూ సిఎం జగన్‌ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తెలంగాణ కంటే రూ.వెయ్యి అందనంగా ఇస్తామని హామీ ఇచ్చి మాటతప్పారన్నారు. ఈ సమ్మెకు సిపిఎం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. అంగన్వాడీల సమ్మెను కొందరు వైసిపి నేతలు, కార్యకర్తలు సహించలేక దౌర్జన్యాలకు దిగుతున్నారని, ఇందుకు ఉదాహరణే చింతలపూడి శిబిరంలో ఓ కార్యకర్త మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి దిగడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.నారాయణ, మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరావు, ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సరోజని, సరళ, హేమలత, వెంకమ్మ పాల్గొన్నారు. ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు ఎం.త్యాగరాజు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాధం పాల్గొన్నారు. ముసునూరు:అంగన్వాడీల వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఐసిడిఎస్‌ నూజివీడు ప్రాజెక్టు కార్యదర్శి పల్లిపాము రాజకుమారి అన్నారు. ముసునూరులో అంగన్వాడీల సమ్మె పదో రోజు కొనసాగింది. ఈ సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు జి.రాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు అండగా ఉంటామన్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గ, లక్ష్మీ, శిరీష, విద్యావతి, విజయలక్ష్మి, మేరీసులోచన పాల్గొన్నారు.ద్వారకాతిరుమల : మండలంలో అంగన్వాడీల సమ్మె పదో రోజు లబ్ధిదారులు, అంగన్వాడీ పిల్లలు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెయిన్‌ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి గుడి సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.కొయ్యలగూడెం : మండలంలో అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ అంగన్వాడీలు అలుపెరగని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పదించడం లేదన్నారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టి ఇతరులతో నిర్వహించాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో బి.సత్యవతి, కె.జయసుధ, టి.శివలక్ష్మి, ఎన్‌.పోసిరత్నం, కె.శిరీష, బి.ప్రసన్న, వి.సత్యవతి, అంగన్వాడీ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు శివరత్నకుమారి, పి.పద్మజ, జె.నాగవేణి, అడపా నాగజ్యోతి, సిహెచ్‌.సునీతరాయల్‌, బొబ్బిలి చిట్టి, జ్యోతి, మాధవి, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, మంగ, శ్రీదేవి, నుర్జహాన్‌ పాల్గొన్నారు.నూజివీడుటౌన్‌ : స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన అంగన్వాడీల నిరవధిక సమ్మె పదోరోజూ కొనసాగింది. ఈ సమ్మెకు నూజివీడు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన న్యాయవాదులు మద్దతు తెలిపారు. చాట్రాయి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్‌వాడీలు పాల్గొన్నారు.జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని సిఐటియు పట్టణ అధ్యక్షులు పసల సూర్యారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు విమల మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు విమల, మండల, పట్టణ అంగన్వాడీ కేంద్రాల వర్కర్లు పాల్గొన్నారు.ఆగిరిపల్లి: అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర నాయకులు డివి.కృష్ణ డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెను ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రాజు, కుశలవ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కెవికె.ప్రసాద్‌, ఆర్‌.చంటి పాల్గొన్నారు.టి.నరసాపురం : అంగన్వాడీల సమ్మె పదోరోజూ కొనసాగింది. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు అనుమోలు మురళీ, అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు. జీలుగుమిల్లి : అంగన్వాడీల నిరవధిక సమ్మె పదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సమ్మెకు సిపిఎం, సిఐటియు, టిడిపి మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, కొండలరావు, ఎస్‌.సాయి, ఎంపిటిసి నాలి శ్రీను, అఖిల్‌, అంగన్వాడీలు నాగమణి, ఎస్తేరు, పూర్ణావతి, సరళ పాల్గొన్నారు.బుట్టాయగూడెం : అంగన్వాడీల నిరవధిక సమ్మెకు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, మండల ఉపాధ్యక్షులు తీగల గోపాలకృష్ణ, ఏడుకొండలు అధికారిక ప్రతినిధి మెట్టా బుచ్చిరాజు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, పోలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి చిర్రి బాలరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూనెం రాజా, కొక్కెర పద్మరాజు, ఇనుముల పున్నారావు, జోడెం కృష్ణమూర్తి, కైగాల సూరిబాబు, కూరం దుర్గారావు, మాణికల దుర్గారావు, మిరియాల సతీష్‌, కందుకూరి వెంకటేష్‌, ఆకుల పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు.కలిదిండి : అంగన్వాడీల సమ్మె పదో రోజూ కొనసాగింది. ఈ సమ్మెలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు కె.సీతామహాలక్ష్మి, విజయలక్ష్మి, నాయకులు పి.మాణిక్యం, ఎం.సుధ, కె.చెల్లమ్మ, స్వరూపారాణి, డి.శివకుమారి, మండల నాయకులు షేక్‌ అబిదా బేగం, జక్కంశెట్టి మేనకలక్ష్మి, కొప్పినీడి రమాదేవి పాల్గొన్నారు.

➡️