ప్రభుత్వం దిగొచ్చే వరకూ సమ్మె

అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు, యూనియన్‌ నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అంగన్వాడీల సమస్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి డిమాండ్‌ చేశారు. ఈ నెల 8 నుండి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేపడతారని, ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 67వ వర్థంతి సందర్భంగా యూనియన్‌ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టనంలోని పల్నాడు రోడ్డులో అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్వాడీలు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో వెట్టిచాకి చేస్తున్నారని, పెరిగిన ధరలతో పోలిస్తే వారికిచ్చే జీతాలతో కుటుంబాలు గడవడం కష్టమవుతోందని అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నికలప్పుడు హామీఇచ్చిన వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఏ ఒక్క హామీనీ నేరవేర్చలేదన్నారు. పలు రకాల యాప్‌లతో ఇబ్బంది పెడుతున్నారని, బిల్లుల మంజూరులో జాప్యం చేస్తున్నారని, ఇవన్నీ అంగన్వాడీలను తీవ్ర మానిసిక, ఆర్థిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని విమర్శించారు. శ్రామిక మహిళ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌ డి.శివకుమారి, సిఐటియు మండల కార్యదర్శి సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో కీలకమైన అంగన్వాడీల సమస్యలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ఐసిడిఎస్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు తగ్గించి ఆ సేవలను ప్రజలకు అందకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. కె.కవిత, బి.సాయికుమారి, ఎన్‌.శ్రీలక్ష్మి తదితర అంగన్వాడీలు మాట్లాడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. రకరకాల యాప్‌లు తెచ్చి రోజురోజుకూ పని భారం పెంచుతున్నారని, పైగా ఇంటర్‌నెట్‌ సమస్యల వల్ల వివరాలు నమోదు చేయలేకపోతున్నామని చెప్పారు. ఇదే సమయంలో రికార్డులు రాయాల్సి వస్తోందన్నారు. ఏళ్ల తరబడి చాకిరీ చేసిన తమకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ లేకుండానే ఇంటికి పంపుతున్నారని వాపోయారు. రాజకీయ వేధింపుల వల్ల అర్హులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు. మినీ వర్కర్లకు మెయిన్‌ వర్కర్లుగా చేసి కనీస వేతనం ఇవ్వడం ద్వారా గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం ఇవ్వాలన్నారు. సరుకులు నాణ్యంగా ఉండడం లేదని, వీటిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకూ పోరాడతామన్నారు.

➡️