ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటం : సిపిఎం

 మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి-గుంటూరు :
అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే అన్ని పార్టీలు, సంఘాలు కలిసి అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి హెచ్చరించారు. తక్షణమే యూనియన్లతో చర్చలు జరిపి, డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. మంగళవారం బ్రాడీపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించటం సరికాదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు సచివాలయ సిబ్బంది చేత పగలగొట్టించడం దారుణమన్నారు. తెలంగాణ కంటే 1000రూపాయలు అదనంగా ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా అడిగి అడిగి విసిగిపోయిన అంగన్‌వాడీలు సమ్మెకు దిగారని, వారిపై సచివాలయ సిబ్బందిని, యానిమేటర్లను రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. ఇలాంటి నియంతృత్వ విధానాలు అనుసరిస్తే ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్‌మెంట్‌ భెనిఫిట్స్‌ రూ.5 లక్షలకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పథకాలు వర్తిపంజేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలవి గొంతెమ్మ కోర్కెలు కాదని, వాగ్దానాలే అమలు చేయాలంటున్నారని అన్నారు. కార్మికవర్గాన్ని, స్కీమ్‌ వర్కర్లకు అణచివేయాలని ప్రయత్నిస్తే తగిన గుణం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బి.శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️