ప్రభుత్వమే ధాన్యం రవాణా చేయాలి

Jan 9,2024 21:57

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని ప్రభుత్వమే రవాణా చేసి మిల్లులకు తరలించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, ఉపాధ్యక్షులు బంటు దాసు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైనప్పటికీ నేటి వరకు రైతులే తాము స్వయంగా రవాణా ఏర్పాట్లు చేసుకుని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తున్నారు తప్పితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రవాణా ఏర్పాటు చేయడం లేదని అన్నారు. దీనివల్ల రైతులు ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వం నిర్దేశించిన రవాణా చార్జీలు కంటే అదనంగా డబ్బులు చెల్లించుకుని రవాణా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనివల్ల రైతులకు ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ డబ్బులందక రైతులు నానా అవస్థలు పడుతున్నారని, సంక్రాంతి సందర్భంగా రైతుల వద్ద డబ్బులు లేక ఇబ్బందుల గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతుల ధాన్యానికి చెల్లించాల్సిన డబ్బులతో పాటుగా రవాణా, హమాల చార్జీలను కూడా చెల్లించాలని కోరారు. ఇదివరకే రైతుల నుంచి మిల్లర్లు అధికంగా తీసుకున్న ధాన్యానికి గాను డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకొని, రైతుల నుంచి మిల్లర్లు క్వింటాలుకు 5 కేజీలు చొప్పున అధికంగా డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. అనంతరం సమస్యను తెలియజేస్తూ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేశవ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గేదెల సత్యనారాయణ, పలువురు రైతులు పాల్గొన్నారు.

➡️