ప్రమాదకర నిబంధనలపై పోరాడదాం

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ప్రమాదకర క్రిమినల్‌ చట్ట నిబంధనలపై పోరాడుదామని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రీజినల్‌ ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్ధానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రీజియన్‌ కమిటీ సమావేశం రీజనల్‌ అధ్యక్షుడు బివి రావు అధ్యక్షతన సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు వాటికి పరిష్కార మార్గాలను అనేక పోరాటాలు, ఆందోళనలు ద్వారా పరిష్కరించుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం 1860 చట్టం సెక్షన్‌ 304ఏ ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే కారణం ఏదైనా రెండు సంవత్సరాలు జైలు శిక్ష అందుకు సరిపడిన జరిమానా విధించబడుతుందన్నారు. భారతీయ న్యాయ సంహిత చట్టం 2023 సెక్షన్‌ 161.ఎ. ప్రకారం ఐదు సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా విధించబడుతుందని, కొత్త చట్టం డిసెంబర్‌ 21న పార్లమెంట్‌లో, 25న రాష్ట్రపతి ఆమోదం పొందిందన్నారు. ఆ చట్ట ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష, అందుకు సరిపడిన జరిమానా విధించబడుతుంది. దీంతో డ్రైవర్లు పనికి రాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు, చనిపోవడానికి అసలు కారణాలను పరిశీలించాలని శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు ప్రమాదాలకు రహదారి నిర్మాణాలు క్రమ పద్ధతిలో లేకపోవడం, ఇతర దేశాల్లో మన కంటే మిన్నగా రోడ్‌ వ్యవస్థలు ఉన్నాయని, వాటిని దేశంలో ఆచరించకపోవడం, కుడివైపుకి వెళ్లే సందర్భంలో తగిన జాగ్రత్తలు, నిబంధనలు పాటించకపోవడం, ఇద్దరు డ్రైవర్లు లేకపోవడం, విశ్రాంతికి తగిన సౌకర్యాలు కల్పించ లేకపోవటం ప్రమాదాలకు కారణాలని తెలిపారు. ఈ విధానాలను పరిశీలించకుండా చట్టంలో శిక్షలు పెట్టడం ద్వారా యాక్సిడెంట్‌ తగ్గుతాయనేది వాస్తవం కాదన్నారు. మోటార్‌ వెహికల్‌ చట్టం వచ్చిన తర్వాత ప్రమాదాలు తగ్గకపోగా 2022లో యాక్సిడెంట్లు పెరిగిన నివేదికలున్నాయన్నారు. ఈ విధానా లకు వ్యతిరేకంగా ఉద్యోగులు కార్మికులందరూ పోరాటాలు చేయాలని, చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 2019 మోటార్‌ వాహన చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో పోరాటాలను పెంచాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నాయకులు జివి సుజాత, పీరావలి, సుబ్బారావు, మల్లికార్జున, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️