ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : మిచౌంగ్‌ తుపాను ప్రభావం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌ నుండి తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై తెనాలి సబ్‌ కలెక్టర్‌, గుంటూరు ఆర్‌డిఒ, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలల్లో తాగునీరు, ఆహరం, పారిశుధ్యం, మందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కాకుమాను, ప్రత్తిపాడు, చేబ్రోలు, దుగ్గిరాల, కొల్లిపర, పొన్నూరు మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనందున లోతట్టు ప్రాంతలల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాలలో చేర్పించాలన్నారు. పునరావాస శిబిరాల నుండి వారు తిరిగి ఇంటికి వెళ్లే వరకూ అసౌకర్యం కలుగకుండా తాగునీరు, ఆహరం, మందులు, టాయిలెట్స్‌ సదుపాయాలు కల్పించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టమూ జరుగలేదన్నారు. తుపాను బాపట్ల తీరం దాటిన తరువాత భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. చెరువులకు ఎక్కడా గండి పడలేదని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారని, గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్‌ స్తంభాలు కూలిన వెంటనే వాటిని పునరుద్ధరించి విద్యుత్‌ను సరషరా చేయాలని చెప్పారు. గాలుల వలన రోడ్లపై చెట్లు పడినపుడు వాటిని తొలగించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా వుంచుకొని రోడ్డు ప్రయాణాలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, నిధుల విషయంలో రాజీ పడొద్దని సూచించారు. తుపాను వల్ల జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి తెలియజేయాలని, జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నం.0863-2234014కు సమాచారాన్ని అందించాలని చెప్పారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు సమన్వయంతో వారికిచ్చిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు.

మిచౌంగ్‌ తుపాన్‌ నేపథ్యంలో ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. మంగళవారం నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో విద్యుత్‌, రోడ్లు భవనాలు శాఖ అధికారులతో సమీక్షించారు. ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. అవసరమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి, ఉద్యాన శాఖాధికారి బెన్నీ, పౌడా వి.సి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌రెడ్డి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
విద్యాసంస్థలకు సెలవు పొడిగింపు
మిచౌంగ్‌ తుపాను వల్ల భారీ వర్షాలు పడుతున్న కారణంగా పల్నాడు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు బుధవారమూ సెలవు ప్రకటిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️