ఫిర్యాదులకు సి-విజిల్‌ యాప్‌

Mar 20,2024 21:20

 ప్రజాశక్తి-విజయనగరం :  ఎన్నికలకు సంబంధించి మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనపై ఫిర్యాదుల కోసం పబ్లిక్‌ యాప్‌ సి-విజిల్‌ ద్వారా స్వీకరిస్తామని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ లో రెండు ల్యాండ్‌ లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేసి సిబ్బందిని 24/7 ఫోన్‌ వద్ద అందుబాటులో ఉంచామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో కలెక్టర్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సి-విజిల్‌ యాప్‌లో మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనపై ఫిర్యాదులు పంపవచ్చని తెలిపారు. పార్టీలకు చెందిన వారు మద్యం, నగదు, బహుమతులు వంటివి పంపిణీ చేసినా లైవ్‌ ఫోటో లు, వీడియోల ద్వారా ఈ యాప్‌లో పంపాలని తెలిపారు. ఈ యాప్‌ లో పెట్టిన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. దీనితో పాటు 1950 కాల్‌ సెంటర్‌ నెంబర్‌ కు కూడా ఫిర్యాదులను చేయవచ్చని అన్నారు. కంట్రోల్‌ రూమ్‌ లో రెండు ల్యాండ్‌ లైన్‌ నంబర్‌ లను ఏర్పాటు చేసామని, 08922 -797120 , 09822-797124 నెంబర్లకు కోడ్‌ ఉల్లంఘన పై ఫిర్యాదులను , ఎన్నికల సమాచారం కోసం ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.ప్రింట్‌ మీడియాలో వచ్చే పొలిటికల్‌ వార్తలను ప్రెస్‌ కౌన్సిల్‌ నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేసారు. ఎలక్ట్రానిక్‌ మీడియా లో , సోషల్‌ మీడియాలో పొలిటికల్‌ ప్రకటనల కోసం వచ్చే వీడియో లకు, ఆడియోలకు ఎంసిఎంసి ప్రీ సర్టిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అందుకోసం 48 గంటల ముందే ఎంసిఎంసికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పక్షపాత రహితంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, మీడియా , ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఐపిఆర్‌ఒ డి.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️