బంగార్రాజుకు న్యాయం చేయాలి

Mar 9,2024 21:15

 ప్రజాశక్తి-భోగాపురం : నెల్లిమర్ల నియోజవర్గం ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుకు న్యాయం చేసే వరకు జనసేనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని నియోజవర్గంలోని నాలుగు మండలాల నాయకులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుకు తేల్చి చెప్పారు. బంగార్రాజుకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అచ్చెన్నా యుడు ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. భోగాపురం. పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాల అధ్యక్షులైన కర్రోతు సత్యన్నారాయణ, మహంతి శంకరరావు, పల్లె భాస్కరరావు, కడగల ఆనందకుమార్‌, నగర పంచాయతీ అధ్యక్షులు బైరెడ్డి లీలావతితో పాటు నాయకులంతా సుమారు 50కార్లలో బంగార్రాజును తీసుకొని శనివారం అచ్చెన్నా యుడును కలిశారు. మాజీమంత్రి పతివాడ నారాయణ స్వామినాయుడు వర్గం కూడా కలిసి వెళ్లడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో వారంతా ఆయనను కలిశారు. టిడిపి కోసం ఎంతో కష్టపడినా పొత్తుల్లో భాగంగా జనసేనకు సీటు కేటాయించడంతో కేడర్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపినట్లు సమాచారం. బంగార్రాజుకు న్యాయంచేసిన తరువాత ఆయనతో నియోజవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయించాకే జనసేనతో కలిసి పనిచేసేందుకు ముందుకు వెళ్తామని చెప్పినట్లు తెలిసింది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును కేటాయించి నందున గెలిపించాల్సిన భాద్యత మనమందరిపై ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. బంగార్రాజు లాంటి నాయకుడిని వదులు కునేందుకు చంద్రబాబు సిద్దంగా లేనందున ఏదోఒక న్యాయం చేస్తారని అన్నారు. రెండు మూడు రోజుల్లో బంగార్రాజుకు స్పష్టమైన హామీ వస్తుందని అన్నారు. అచ్చెన్నాయుడును కలిసిన వారిలో మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్‌, పతివాడ తమ్మునాయుడు, అప్పలనారాయణ, సువ్వాడ రవిశేఖర్‌,వనజాక్షి, కడగల ఆనంద్‌, వెంపడాపు సూర్యనారాయణ, ఆకిరి ప్రసాదరావు, గేదెల రాజారావు, పాణీరాజు ఉన్నారు.

➡️