బకాయిలు చెల్లించకపోవటం దుర్మార్గం

Jan 25,2024 00:24

గుంటూరులో నిరసన ర్యాలీలో ఉపాధ్యాయులు

నరసరావుపేటలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
ఉపాధ్యాయులు, ఉద్యోగులు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న పొదుపు సొమ్మును ఏళ్ల తరబడి చెల్లించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం తగదని యుటిఎఫ్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎఫ్‌, ఏపీ జిఎల్‌ఐ, పీఆర్సీ, ఇఎల్‌, డిఎల పెండింగ్‌ బకాయిలు రూ.18 వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలని, 30 శాతం ఐఆర్‌తో పాటు కొత్త పీఆర్సీ విధి విధానాలు రూపొందించాలని కోరారు. ఈ మేరకు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో గుంటూరు, నరసరావుపేటలో బుధవారం నిరసన ప్రదర్శనలు చేశారు. ఇందులో భాగంగా గుంటూరులోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌ నుండి లాడ్జి సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్లరిబ్బన్లతో కొవ్వొత్తులతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయం నుండి డిఇఒ కార్యాలయం వదకూ ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. మార్గం మధ్యలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌.కుసుమకుమారి, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌, పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారధి మాట్లాడుతూ ఇవ్వాల్సిన డిఎలు తొక్కిపెట్టి, చెల్లించిన ఐఆర్‌ కూడా తిరిగి కట్టించుకున్న ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సరెండర్‌ లీవులు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ సేవింగ్‌ సొమ్ము చెల్లించకపోవటం దుర్మార్గమన్నారు. కొత్త పిఆర్‌సి విధి విధానాలను వెంటనే ప్రకటించాలని, ఈలోగా ఐఆర్‌ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులను భర్తీ చేసి పాఠశాల విద్యను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థికంగా బలంగా ఉందని అసెంబ్లీలో చెబుతున్న సిఎం ఉపాధ్యాయులకు మొండిచేయి చూపడం సరికాదని విమర్శించారు. సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న ఉపాధ్యాయులపై నిర్బంధానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈనెల 28న రాజమండ్రిలో భారీ సదస్సుకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి పాత పెన్షన్‌పై వారి నిర్ణయాలను ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు సిహెచ్‌.ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందయ్య, టి.ఆంజనేయులు, అడవి శ్రీనివాసరావు, యు.రాజశేఖర్‌రావు, కె.కేదార్నాద్‌, జి.వి.ధనలక్ష్మి, కె.ప్రేమ్‌కుమార్‌, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేటలో నాయకులు ఎం.మోహన్‌రావు, ఎ.భాగేశ్వరిదేవి, జె.వాల్యానాయక్‌, రవిబాబు, అజరుకుమార్‌, వెంకటేశ్వర్లు, ప్రకాశరావు, తిరుపతి స్వామి, ఆయేషా సుల్తానా, ఉష, సౌరి రాణి, సుందరరావు, నర్సింహారెడ్డి 400 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️