బకాయిలు చెల్లించాలని నేడు సత్యాగ్రహం

Jan 29,2024 20:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తక్షణమే జీవోలు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సత్యాగ్రహం చేస్తునట్లు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్రావు, నాయకులు బొగ్గు భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కమిషనర్‌కు, మున్సిపల్‌ హెల్త్‌ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయనగరం పంప్‌ హౌస్‌ కార్మికులకు 2 నెలల నుంచి 6 నెలల వరకు జీతాలు, పారిశుధ్య కార్మికులకు 2 నెలల హెల్త్‌ అలవెన్స్‌ లు బకాయిలు ఉన్నాయని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ నిర్బంధం, అధికారుల ఒత్తిడిని ఎదుర్కొని 16 రోజులు మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేశారని, గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ అంగీకరించి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకు జీవోలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంక్రాంతి కానుక వెయ్యి రూపాయలు తక్షణమే జమ చేయాలని, పనిముట్లు రక్షణ పరికరాలతో పాటు యూనిఫామ్‌ కుట్టుకూలీ డబ్బులు చెల్లించాలని మున్సిపల్‌ ప్రజారోగ్య అధికారి కె. సాంబమూర్తికి, పంప్‌ హౌస్‌ కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని కోరుతూ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ రావుకు, మున్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.శ్రీనివాసరావుకు వినతులు ఇచ్చినట్లు తెలిపారు. సత్యాగ్రహంలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

➡️