బకాయి డిఎలను వెంటనే చెల్లించాలి

Feb 1,2024 20:23

ప్రజాశక్తి – నెల్లిమర్ల: మిమ్స్‌ యాజమాన్యం సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బకాయి ఏడు డిఎలను ఇవ్వాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని, అన్యాయంగా సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిరవధిక ధర్నా చేపట్టారు. ఈ సంధర్భంగా టివి రమణ మాట్లాడుతూ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే మిమ్స్‌ యాజమాన్యం సస్పెండ్‌ చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యంగా సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోని బకాయి ఉన్న 7 డిఎలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కక్ష సాధింపు, వేధింపులు ఆపి, బదిలీ చేసిన ఉద్యోగులను మిమ్స్‌లోని డ్యూటీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్‌ చేసి వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలు పరిష్కారించే వరకు నిరవధిక ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో మిమ్స్‌ ఉద్యోగులు ఎం.నారాయణరావు, వి. అప్పల నాయుడు, కె. కాము నాయుడు, టి. రామకృష్ణ, ఎం.నాగ భూషణం, కె. నాగేశ్వర రావు, జి. వరలక్ష్మీ, వి.భవాని, బి. బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️