బద్వేల్‌ వైసిపిలో భగ్గుమన్న విభేదాలు

ప్రజాశక్తి -పోరుమామిళ్ల
మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సిఎం సొంత జిల్లాలో వైసిపిలో అసమ్మతి సెగ తగలుతోంది. ఇందుకు బద్వేల్‌ నియోజకవర్గంలో వైసిపిలో విభేదాలు తారాస్థాయికి చేరడమే. అభ్యర్థి ఎంపిక విషయంలో రెండు గ్రూపుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకు టికెట్‌ ఇవ్వొద్దంటూ ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి వ్యతిరేక గ్రూపు నాయకులు అధిష్టానం వద్ద పట్టుబట్టింది. ఇందులో భాగంగా సోమవారం పోరుమామిళ్లలో వైసిపి వ్యతిరేక గ్రూపు నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సుధాకు టికెట్‌ ఇస్తే సహకరించబోమని తెగేసి చెప్పారు. నిన్నటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ప్రస్తుతం బహిర్గతమమయ్యాయి. ఎమ్మెల్యే సుధాకు టికెట్‌ కేటాయిస్తే సహకరించబోం.. బద్వేల్‌ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సుధాకు కేటాయిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహకరించబోమని వైఎస్‌ఆర్‌సిపి మండల నాయకులు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. బద్వేల్‌ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ సిపి అసమ్మతి నేతల సమావేశం వైఎస్‌ఆర్‌ సిపి మండల నాయకులు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో కాలువ కట్ట సమీపంలోని ఆయన ఎస్టేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్‌ నియోజకవర్గ వైసిపికి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అనుచరులు వ్యవహరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు విసిగిపోయారన్నారు. పూర్తిగా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దష్టిలో పెట్టుకొని తాము ఎంతో ఓపిక పట్టామన్నారు. 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నిర్వాహకంతో తాము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంత ఇబ్బందులు పడ్డామని చెప్పారు. డాక్టర్‌ సుధా ఎమ్మెల్యే అయిన తర్వాత తమకు, కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. ఆమె ఎమ్మెల్సీ మాటకే కట్టుబడుతూ తమల్ని ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. 2024లో నిర్వహించబోయే ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారని ప్రకటించుకుని వారి అనుచరుల ద్వారా నియోజకవర్గంలో బాణాసంచా కాల్చడం, కేకులను కట్‌ చేసుకుని స్వీట్స్‌ పంచి పెట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి పార్టీ ఏమైనా పర్వాలేదు.. ఓడిపోయినా తన పంతం నెగ్గాలనే భావన కనిపిస్తుంది తప్ప అందరిని కలుపుకోవాలని ఆలోచన ఎంత మాత్రం ఉన్నట్టు కానరావడం లేదని ఆరోపించారు. గెలిస్తే ఒకటి మేలు.. ఓడితే రెండు మేలు అనే రీతిలో ఉన్నారని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని పోయి పార్టీని గెలిపించాలని స్పహ ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ సుధాకి ఇస్తే తాము పనిచేయలేమని చెప్పారు. ఆమోదయోగ్యమైన వ్యక్తిని ప్రకటించకపోతే కార్యకర్తల ఆలోచన మేరకు తమ భవిష్యత్‌ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, జడ్‌పిటిసిలు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ జడ్‌పిటిసిలు, మండల స్థాయి నాయకులు, 24 మంది సర్పంచులు, 20 మంది ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, వైసిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️