బరితెగింపు!

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో వైఫల్యం వెక్కిరిస్తోంది. ఐదేళ్ల కిందట పోలీస్‌, అటవీ శాఖలు చేపట్టిన సంయుక్త నిఘా ఆశించిన సత్ఫలితాలు ఇవ్వలేదని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గ పరిధిలోని కంభంవారిపల్లి మండలంలో స్మగ్లర్ల నిర్వాకం తెలియజెబుతోంది. స్మగ్లర్ల బరితెగింపు ఘటనలో అకారణంగా ఓ పోలీస్‌ మృతి చెందిన ఘటన ఆందోళన కలిగించింది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే ఎర్రచందనం స్మగ్లింగ్‌ తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంటున్న గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల మీదుగా ఎర్రచందనం తరలిపోతుండడం తాజా ఘటనే తార్కాణం. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము సమయాల్లో స్మగ్లర్ల హవా నడుస్తూనే ఉంది. గతంలో ఐజి స్థాయి అధికారులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోదంపై టాస్క్‌పోర్స్‌ ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచడం తెలిసిందే. ఐదేళ్ల కిందట నుంచి టాస్క్‌ఫోర్స్‌ నిఘా కార్యకలాపాల పర్యవేక్షణను ఎస్‌పి స్థాయికి కుదించడంలో మర్మమేమిటనే సందేహాలు వ్యక్తమవు తుండడం గమనించాల్సిన విషయం. ప్రకృతి వనరుల్లో భూగోళంలోనే అరుదైన సంపద వృక్ష సంపద ఎర్రచందనం. తిరుపతి నుంచి కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని శేషాచల అడవుల్లో అపారంగా నిక్షిప్తమై ఉంది. ఇటువంటి అరుదైన వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బృహత్తర బాధ్యత పాలకులపై ఉంది. రాష్రానికి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలు లేకుండా స్మగ్లింగ్‌ నడవడ మనేది అసాధ్యమని చెప్పవచ్చు. ఇటువంటి అరుదైన వృక్షసంపద సీమకే తలమానికంగా నిలుస్తోంది. ఇటువంటి ప్రత్యేకతల్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. రాజకీయ నాయకత్వం బాధ్యత మరింత హెచ్చు. రాజకీయం మామూళ్ల మత్తులో జోగుతున్న కారణంగా ప్రకృతి సమతుల్యత ప్రశ్నార్థకంగా మారింది. వృక్షజాతుల్లోనే అరుదైన వృక్షాలుగా ఎర్రచందనం, రక్తచందనం, మందారం, బిల్వ కల్పవృక్షాలుగా పరిగణన పొందిన సంగతి తెలిసిందే. ఇటువంటి అరుదైన వృక్ష జాతులను సంరక్షణ అరణ్య రోదనగా మారింది. ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధానికి సంబంధించి నిజాయతీ పరులైన ఉన్నత స్థాయి పోలీస్‌, ఫారెస్ట్‌ అధికారులను నియమించడం, ఖాళీలను భర్తీ చేయడం, ఆత్మరక్ష ణార్థం ఆయుధాలను సమకూర్చడం, వారి ఇతర అవసరాలకు ముఖ్యమంత్రి స్థాయిలో సహకారం అందిస్తే స్మగ్లింగ్‌ను అరికట్టడం సునాయాసమనే వాదన వినిపిస్తోంది. కడప జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు బరితెగింపును తలపించడం ఆందోళన కలిగింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు సాగించడం సహజం. కానీ ప్రతిపక్షాల ప్రజాస్వామిక రాజకీయాలను అడ్డుకునే స్థాయిలో ఉండడం అభ్యంత రకరం. ఇటీవల కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దనూరు మండలంలో ప్రతిపక్షాల కార్యకలాపాలకు అడ్డు తగలడం అప్రజాస్వామికం. అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పరం భౌతికదాడులకు పాల్పడడం, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలకు పాల్పడడం ఆందోళనకరం. కడప జిల్లా కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఆయుధాలతో దాడులకు పాల్పడడం, ఒకరు గాయాల పాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి అప్రజాస్వామిక ధోరణులకు ఎవరు పాల్పడినా క్షమార్హం కాదనే సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️