బహిరంగ విచారణకు సిద్ధం

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపులో మద్దాలిగిరి హస్తం ఉందని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. తాను ఆధారాలతో సహా మద్దాలి గిరి అక్రమాలు బయటపెడితే తమ మీద ఇవి ఫేక్‌ అంటూ పోలీసు కేసు పెట్టడాన్ని తాను నేను స్వాగతిస్తున్నానని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రవీంద్ర డిమాండ్‌ చేశారు. ఆదివారం గుంటూరు పశ్చిమ టిడిపి కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఓట్ల తొలగింపు దొంగ ‘మద్దాలి గిరి’ అని బాహ్య ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు. దీనితో షాక్‌ తిని 2 రోజులు కనపడకుండా, నిన్న అభద్రతా భావంతో ఎస్‌పికి ఫిర్యాదు చేశారని అన్నారు. తాను 35 ఏళ్లుగా టిడిపిలో ఉన్నానని, గిరి మాత్రం 2014లో టిడిపిలోకి వచ్చి 2019లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నమ్మకద్రోహం చేసి వైసిపిలోకి వెళ్లారని అన్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని చేసిన దందాలు వాస్తవం కాదా? వ్యాపారవేత్తల దగ్గర నుండి బిల్డింగ్‌ యజమానుల వరకు డబ్బుల కోసం వేధించిన విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. తాను బయటపెట్టిన స్క్రీన్‌ షాట్లు అవాస్తవం అని తేలితే రాజకీయాల నుండి వైదొలుగుతానని, నిజమైతే ఆయన వైదొలుగుతారా? అని సవాల్‌ విసిరారు. రేపు బిసిల సమస్యలపై రౌండ్‌టేబుల్‌ భేటిబిసిలు ఎదుర్కొంటున్న సమస్యలపై గుంటూరులో ఈ నెల 28వ తేదీన ఎన్‌ జి ఓ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు బిసి అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని జయప్రదం చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర (నానీ) పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో బిసి నేతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి యనమల రామకష్ణుడు ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. తొలుత రాష్ట్రంలో బిసిల మీద జరుగుతున్న దాడులను వివరిస్తూ టీడీపీ ప్రచురించిన బుక్‌ లెట్‌ను విడుదల చేశారు.

➡️