బాబు మాయ మాటలు నమ్మొద్దు : రాజన్నదొర

Jan 11,2024 21:07

ప్రజాశక్తి – మక్కువ: రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం బురదజల్లుతూ చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు, మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర అన్నారు. స్థానిక తహశీల్దార్‌ సూర్యనారాయణ అధ్యక్షతన మండలంలో ఫ్రీ హౌల్డ్‌ పట్టాలు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజన్నదొర మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 14 ఏళ్లు కొనసాగిందని, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు చేయలేని స్వర్ణాంధ్ర ఇప్పుడు ఎలా చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడానికి చెప్పే మాయ మాటలు తప్ప ఇంకేమీ లేదన్నారు. కావున ప్రజలు ఇలాంటి మాటలు నమ్మిమోసపోవద్దని ప్రజలను కోరారు. సాలూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని పలుమార్లు టిడిపి నాయకులకు సవాల్‌ విసిరినప్పటికీ ఎవరూ ముందుకు రాకుండా ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మండలంలో 733 మంది లబ్ధిదారులకు 712 ఎకరాల భూమికి హక్కులు కల్పిస్తూ పత్రాలను అందజేశారు రెండున్నర రోజులు సచివాలయాలకు పరిమితమయ్యాంరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వినియోగించుకుని ప్రతి సచివాలయంలో రెండున్నర రోజులు ప్రజలతో గడిపామని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. 211 రోజుల పాటు కొనసాగిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సచివాలయానికి ప్రభుత్వం తరపున రూ.20 లక్షలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు మావుడి రంగునాయుడు, ఎంపిపి మర్రి పారమ్మ, ఎంపిడిఒ సూర్యనారాయణ, ఇఒపిఆర్‌డి దేవకుమార్‌, ఎస్సీ సొసైటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️