బియ్యం ధరలు పైపైకి

Dec 24,2023 23:41
బియ్యం

ఖరీఫ్‌ ముగిసినా అదుపులోకి రానివైనం
కిలో రూ.62కు చేరిన సన్నం రకాలు
వంటింటి బడ్జెట్‌ తలకిందులు
ప్రజాశక్తి రాజమహేంద్రవరం
ప్రతినిధిబియ్యం ధరలు రోజురోజుకూ పైపైకి పోతున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ధరలు పలుకుతుండరీతో కొనుగోలుదారులకు కష్టాలు తప్పడం లేదు. ఆర్నెల్లుగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ అనంతరం ధరలు తగ్గుముఖం పడతాయని కొనుగోలుదారులతో పాటు రిటైల్‌ వ్యాపారులు సైతం ఆశించారు. కాని ప్రస్తుతం పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్‌లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రధానంగా సన్నరకాల బియ్యం ధరలు కిలో రూ.62కు చేరుకోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 76 కిలోల బిపిటి ధాన్యం బస్తా రూ.2,550 నుంచి రూ.2,700 వరకు ధర పలుకుతోంది. అదే విధంగా పాత బియ్యానికి డిమాండ్‌ ఉండటంతో కొందరు ఆవిరితో మరపట్టించిన బియ్యాన్ని కలిపి విక్రయిస్తున్నారు. బియ్యం విక్రయిస్తున్న కంపెనీలు పన్నుల నుంచి ఉపశమనం పొందడానికి 26 కిలోలు, 30 కిలోల బస్తాలను అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం 25 కిలోల వరకు బ్రాండ్లతో అమ్ముతున్న బియ్యానికి పన్ను వసూలు చేస్తున్నారు. 25 కిలోలు దాటితే పన్ను ఉండదు. దీనిని దష్టిలో ఉంచుకుని వ్యాపారులు 26 కిలోల బస్తాలను విక్రయిస్తున్నారు. మార్కెట్లో 26 కిలోల సన్నబియ్యం బస్తా ధర రూ.1,550 నుంచి కంపెనీల వారీగా రూ.1,800 వరకూ ఉంది.చిల్లర దుకాణాల్లో కిలోల లెక్కన తీసుకుంటే వీటి ధర మరింత పెరుగుతోంది. టోకుగా కిలో కనిష్టంగా రూ.54 నుంచి రూ.62 వరకూ ధర పలుకుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆర్‌బికె ద్వారా 2.01 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యంలో 55 శాతం వరకు తమిళనాడుకు రవాణా అవుతున్నాయి. పల్నాడు ప్రాంతం నుంచి కొంత తెలంగాణలోని మిర్యాలగూడ మిల్లర్లు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. హైదరాబాద్‌, విశాఖ వంటి నగరాలకు జిల్లా నుంచి సన్నబియ్యం రవాణా అవుతున్నాయి. రైస్‌ మిల్లర్లు 80 కేజీలు మిల్లింగ్‌ చేస్తే సుమారు 57 కేజీల నుంచి 60 కేజీల వరకు బియ్యం దిగుబడి వస్తాయి. మిల్లింగ్‌ కోసం మిల్లర్లకు సుమారు రూ.150 ఖర్చవుతుంది. మిల్లు మెయింటెనెన్స్‌కు ఊక, తవుడు, నూకలు సరిపోతాయి. మొత్తంగా 80 కేజీల ధాన్యం బస్తాకు సుమారు రూ.2వేలు ఖర్చువుతుంది. దిగుబడి 57 కేజీలు రాగా.. కిలో రూ.48 చొప్పున రూ.2,736కు విక్రయిస్తున్నారు. మరికొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని ప్రజల నుంచి కేజీ రూ.13 నుంచి రూ.15వరకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లింగ్‌ చేసే సమయంలో సన్నబియ్యంలో 20 శాతం వరకు ఈ రేషన్‌ బియ్యాన్ని కలిపేస్తున్నారు. వీటినే బ్రాండెండ్‌ పేరిట ప్యాకింగ్‌ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు.వీటన్నిటి ప్రభావంతో గత పదేళ్లలో లేనంతగా రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.. ప్రతి కుటుంబం సగటున నెలకు 26 కిలోల బస్తా కొనుగోలు చేయాల్సి రావడంతో నెలకు రూ.300 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో వ్యాపారులు పెద్దఎత్తున నిల్వచేసిన ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకురాగలిగితే ధరలు అదుపు చేయవచ్చు.జిల్లా యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. క్రిస్మస్‌, భోగి, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రతి ఇంట్లో పిండి వంటలు, స్వీట్లు తయారు చేసుకోవడం పరిపాటి. బియ్యం ధరలు అందుబాటులో లేకపోవడంతో పాటూ కూరగాయలు, ఇతర అపరాల ధరలు సైతం నింగిని తాకుతున్నాయి. దిగువ మద్యతరగతి కుటుంబాల ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే నిత్యావసరాల కోసం నెలవారీ బడ్జెట్‌ రూ. 5వేల నుంచి రూ.8వేలకు చేరిందని వాపోతున్నారు.

➡️