‘బెల్ట్‌’పై కొరవడిన నిఘా..!

Jan 19,2024 23:42
'మద్యాన్ని పూర్తిగా

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

‘మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. మద్యంను పూర్తిగా నిషేధించిన తరువాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా’ ఇదీ ప్రతిపక్షనేత హోదాలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ. అయితే అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని ఆయన అను భవించారు. 5 ఏళ్ల పాలనలో జగన్‌ సర్కార్‌ మద్యపాన నిషేధం మాటనే మరిచిపోయింది. మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టింది. పైగా మరో 25 ఏళ్లు మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి రాష్ట్రాన్ని అప్పుల్లో ముం చేసింది. దీనికితోడు విపరీతమైన ధరలను పెంపుదల చేసి మందు బాబుల కుటుంబాలను గుళ్ల చేస్తుంది. రకరకాల నాశిరకం బ్రాండ్లను అమ్మకాలు చేస్తూ మద్యంబాబుల ఆరోగ్యాలతో చెలగాట మాడుతుంది. మద్యం విక్రయాలపై ఆదాయమే పరమావధిగా భావిస్తూ ఎక్కడికక్కడ బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు బెల్టు దుకాణాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకున్న అధికారులు ఇప్పుడు ఊరు వాడ అనే తేడా లేకుండా బెల్ట్‌ షాపులు దర్శనమిస్తున్నాయి. అయినా సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. ఏమైనా ఫిర్యాదులు వస్తే అడపాదడపా దాడులు చేసి మమా అన్పించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలో 382 మద్యం షాపులు, 43 బార్లు, వాక్‌ ఇన్‌ లిక్కర్‌ స్టోర్లు ఉండగా సాధారణ రోజుల్లో దాదాపు రూ.6 కోట్లు విక్రయాలు జరుగుతున్నాయి. ప్రత్యేక సందర్భాలు, పండుగల రోజుల్లో రోజూవారీ అమ్మకాలు రూ.8 నుంచి 16 కోట్ల దాటుతోంది. అయితే ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున ఐదేళ్లలో మద్యపాన నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా క్షేత్రస్థాయిలో మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో బెల్ట్‌ దుకాణాలు నడుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతీ 10 బడ్డీ దుకాణాల్లో 8 షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. క్వార్టర్‌ బాటిల్‌ పై రూ.10 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలతోపాటు అనధికారికంగా బెల్టు షాపుల ద్వారా గత ఏడాది డిసెంబర్‌ 31 రోజున రూ.7.50 కోట్లు మద్యం అమ్మకాలు జరగగా ఈనెలలో సంక్రాంతి మూడు రోజులపాటు రూ.23 కోట్లు పైనే మద్యం వ్యాపారం జరిగింది. మొత్తంగా నెల రోజుల వ్యవధిలో రూ.100 కోట్లుపైనే మద్యం అమ్మకాలు జరిగాయి. గతంలో బెల్ట్‌ షాపులు లేని సమయంలో ఈ వ్యాపారం సుమారు రూ.70 కోట్లు మాత్రమే ఉండగా ఈ సారి భారీగా బెల్ట్‌ షాపులు పెరగడంతో సుమారు రూ. 30 కోట్లు అదనంగా వ్యాపారం జరిగినట్లు అంచనా. ప్రభుత్వ దుకాణాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుగుతుండగా బెల్ట్‌ షాపుల్లో మాత్రం 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బ్రాండ్లే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని బ్రాండ్లు సైతం ఇక్కడ విక్రయి స్తున్నారు. మంచినీళ్లు దొరకని ప్రాంతాల్లో సైతం మద్యం ఏరులై పారుతుంది. గుడి, బడి అనే తేడా లేకుండా మద్యం బాటిళ్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఇళ్ల మద్యే బహిరం గంగానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా అమ్మకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసంగా అటువైపు చూడకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. నివాస ప్రాంతాలకు అతి చేరువలో బెల్ట్‌ షాపుల్లో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తుండగా అటువైపు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల మందుబాబుల మధ్య వివాదాలు జరుగుతుండగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. మద్యపానాన్ని నిషేధిస్తామని మాట ఇచ్చిన వైసిపి ప్రభుత్వం ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని ప్రాంతాల్లో బెల్టుషాపులు బహిరంగంగానే అమ్మకాలు జరుపుతున్నా సంబంధిత ఎస్‌ఇబి అధికారులు పట్టనట్లే వ్యవహరిస్తుండడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతూ కావాలనే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

➡️