బొబ్బిలిలో నేడు చంద్రబాబు బహిరంగ సభ

Jan 9,2024 21:58

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  తె లుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు తమ్ముళ్లను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల వాతావరణం దగ్గరపడడంతో వైసిపి, టిడిపిల ప్రచారం ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ‘రా… కదిలి రా’ అనే కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఈసారి బొబ్బిలి వేదికగా విజయనగరం – పార్వతీపురం మన్యం జిల్లాల కేడర్‌కు బాబు దిశానిర్థేశం చేయనున్నారు. బొబ్బిలి కేంద్రం ఈ రెండు జిల్లాలకు సమాంతర దూరంలోనూ, పార్టీకి కాస్త బలమైన నియోజకవర్గంగాను గుర్తించిన పార్టీ ఇక్కడ సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా టిడిపి నాయకులు చెబుతున్నారు. బాబు వరుస పర్యటనలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్‌ కనిపిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి ఒకింత క్లారిటీగానే ఉంది. గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట ఎవరికి కేటాయిస్తారనేది తేలాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఆశా వహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బాబు దృష్టిలో పడేందుకు కూడా తహతహలాడుతున్నారు. గత నెల 20న పోలిపల్లి బహిరంగ సభ మాదిరిగానే దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేడు జరగనున్న బహిరంగ సభల్లో కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడం, వైసిపిలోనూ, ప్రభుత్వంలోనూ లోపాలను, అమలుకాని హామీలను ఎత్తి చూపడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

బాబు జిల్లా పర్యటన ఇలా..

బుధవారం ఉదయం 10.15గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో బయలుదేరి, 11గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొబ్బిలి రాజా కాలేజీ మైదానానికి 11.40గంటలకు చేరుకుంటారు. 12గంటలకు సభ ప్రారంభమై 1.30గంటలకు ముగుస్తుంది. అనంతరం 2.30గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మిగిలిన గంట వ్యవధిలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.ఏర్పాట్లు పరిశీలన బొబ్బిలి : బహిరంగ సభ ఏర్పాట్లును మంగళవారం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు, నియోజకవర్గ ఇన్‌చార్జి బేబినాయన, కూన రవికుమార్‌ తదితరులు పరిశీలించారు.

రామభద్రపురం : అశేష జనవాహినితో రా కదలి రా సభ విజయవంతమయ్యేలా కార్యకర్తలను తరలించుకు రావాలని బొబ్బిలి నియోజక వర్గ ఇంఛార్జి బేబీ నాయన పిలుపు నిచ్చారు. మండల పరిధిలో ముచ్చర్లవలసలో మంగళవారం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతి రావు, సీనియర్‌ నాయకులు కనిమెరక శంకరరావుల ఆధ్వర్యాన చంద్రన్న రా కదలి రా సభపై పార్టీ శ్రేణులు తరలింపు పై ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు, కర్రోతు తిరుపతిరావు, ముళ్ళు రాంబాబు పాల్గొన్నారు.

గజపతినగరం: బొబ్బిలిలో జరిగే రా..కదలిరా సభను విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ కోరారు. మంగళవారం గజపతినగరం పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు సభకు వేల సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.చంద్రబాబు సభ జయప్రదం చేయాలి

విజయనగరం కోట : బొబ్బిలిలో బుధవారం జరుగనున్న టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు బహిరంగసభను జయప్రదం చేసేందుకు ఆ పార్టీ నాయకులు కిమిడి కళా వెంకటరావు, రాష్ట్ర పార్టీ పరిశీలకులు గణబాబు, పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌ గజపతిరాజు, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ మంగళవారం అశోక్‌బంగ్లాలో సమావేశమయ్యారు. సభను జయప్రదం చేసేందుకు నాయకులను సమాయత్తం చేశారు.

➡️