భగ్గుమన్న అంగన్వాడీలు

Dec 27,2023 21:41

ప్రజాశక్తి-చీపురుపల్లి   :  ‘అదిరిస్తాం.. బెదిరిస్తాం అంటే అదిరిపోయేది బెదిరిపోయేది ఎవరూ లేరు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదు’ అంటూ అంగన్‌వాడీలు కదం తొక్కారు. అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్రనాయకులతో ప్రభుత్వం చేసినచర్చలు విఫలం కావడంతో బుధవారం ఎమ్మెల్యేల ఇళ్లను అంగన్‌వాడీలంతా ముట్టడించారు. తమ సమస్యలను ఎమ్మెల్యేల వద్ద ఏకరువు పెట్టారు. స్పందించిన ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తామని హామీ ఇచ్చారు. గరివిడిలోని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని అంగన్‌వాడీలంతా ముట్టడించారు. సిఐటియు రాష్ట్ర నాయకులు టివి రమణ, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్సర్స్‌ యూనియన్‌ నాయకులు వరలక్ష్మి, మాలతీ ఆధ్వర్యాన వందలాదిగా కదలివచ్చారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. భారీగా తరలి వచ్చిన అంగన్‌వాడీలు ఒక్కసారిగా మంత్రి ఇంటిని ముట్టడించే యత్నం చేసారు. దీంతో సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు దామోదరరావు, సన్యాసినాయుడలు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టివిరమణ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని 16 రోజుల నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె చేస్తుంటే చర్చల పేరుతో మంత్రి బొత్స సత్యన్నారాయణ పిలిచి అదిరించడం బెదిరించడం మంచి పద్దతి కాదని అన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించాలని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సొమ్మసిల్లిన అంగన్‌వాడీ హెల్సర్‌ వరలక్ష్మి ఇంటి ముట్టడి సమయంలో ధర్నాలో పాల్గొన్న గుర్ల మండల ప్రాజెక్టు పరిధిలోని గొలగాం గ్రామానికి చెందిన మంత్రి వరలక్ష్మి అనే అంగన్‌వాడీ హెల్పర్‌ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో అక్కడున్న తోటి అంగన్‌ వాడీలు, పోలీసులు స్పందించి హుటాహుటిన వరలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె కోలుకుంది.

రాజాం : ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటిని అంగన్‌వాడీలంతా ముట్టడించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తినాయుడు మాట్లాడారు ఎమ్మెల్యే లేకపోవడంతో ఆయన కార్యాలయ సిబ్బందికి వినతినిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఉమా కుమారి, శ్రీదేవి, పుణ్యవతి, కాలిరత్నం, జయలక్ష్మి ,సునీత, భారతి, చిన్నమ్మడు, నిర్మల, శ్రీదేవి, ధవలేశ్వరి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి లేఖ రాస్తాం : కోలగట్ల

విజయనగరంటౌన్‌ : అంగన్‌వాడీలంతా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీ ఎత్తున మొహరించి అంగన్వాడీలను నిలువరించేందుకు ప్రయత్నం చేయడంతో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. కోలగట్ల స్పందించి అంగన్‌వాడీలందరినీ లోపలకు పిలవడంతో అంగన్వాడీలు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. స్థానికంగా ఏమైనా సమస్యలుంటే తాను పరిష్కరించగలనని, పైస్థాయిలో ఉన్నందున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి అక్కడిక్కడే లేఖ రాసి ఫ్యాక్స్‌లో పంపించారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు బి. సుధారాణి, నగర కార్యదర్శి బి.రమణ మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా ఉంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్‌ కుమార్‌, నగర కార్యదర్శి సుంకర సతీష్‌, తదితరులు మద్దతు ప్రకటించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

బొబ్బిలి : ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

డెంకాడ : నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ స్వగ్రామం మోపాడలో ఆయన నివాసం వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. సిఐటియు నాయకులు బి.సూర్యనారాయణ ఆధ్వర్యాన ఎమ్మెల్యేకు వినతి అందజేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కొత్తవలస : ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయాన్ని వియ్యంపేట, ఎస్‌.కోట ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. సిఐటియు నాయకులు గాడి అప్పారావు, మద్దెల రమణ, వియ్యంపేట ప్రాజెక్టు అధ్యక్షురాలు కాకర తులసి ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

శృంగవరపుకోట : ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నివాసం వద్ద అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యాన వినతి అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడుతానని తెలిపారు. సమ్మెకు జనసేన నాయకులు వబ్డిన సత్యనారాయణ, గంధవరపు సతీష్‌, రుద్రనాయుడు, లోక్‌సత్తా నాయకులు కాండ్రేగుకుల ప్రసాద్‌ మద్దతు తెలిపారు.

అంగన్‌వాడీల పొర్లు దండలు

భోగాపురం : సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని సిఐటియు జిల్లా కార్యదర్శి బి. సూర్యనారాయణ అన్నారు. అంగన్వాడీలంతా సమ్మె శిబిరంలో పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. యూనియన్‌ నాయకులు కష్ణవేణి, కొర్లమ్మ, శ్రీదేవి, ప్రవీణ, అనిత పాల్గొన్నారు. గంట్యాడ : కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాజెక్టు ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లిలో అంగన్‌వాడీ ఆయా మృతికి సమ్మె శిబిరంలో నివాళులర్పించారు. రమణమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరారు.

➡️