భర్త, అత్తమామలు కలిసి హత్య

ప్రజాశక్తి – కారంపూడి : భర్త, అతని తల్లిదండ్రులు కలిసి మహిళను హతమార్చిన ఘటన మండల కేంద్రమైన కారంపూడిలో ఆదివారం వెలుగు చూసింది.. పోలీసుల వివరాల ప్రకారం.. కారంపూడిలోని సుగాలి కాలనీకి చెందిన రామావత్‌ చిన్న బర్మానాయక్‌కు, బొల్లాపల్లి మండలం హనుమాపురానికి చెందిన దేవిబారుతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరికీ తరచూ వివాదాలు వస్తున్నాయి. పెద్దల సమక్షంలోనూ పలుమార్లు పంచాయితీలు పెట్టారు. పోలీస్‌స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తలతో పాటు బర్మా నాయక్‌ తల్లిదండ్రులు కూడా పొలంలోని మిర్చి పంట వద్దకు కాపలా కోసం వెళ్లారు. కొద్దిసేపటికి దంపతులిద్దరికి మళ్లీ గొండవ మొదలైంది. దీంతో బర్మా నాయక్‌ తన తల్లిదండ్రులైన శామిని భాయి, లాలు నాయక్‌ సహాయంతో దేవిభారుని నీటిలో ముంచి ముంచి ఊపిరాడకుండా చేయడం ద్వారా హతమార్చాడు. ఆదివారం ఉదయాన్నే అటుగా వెళ్లిన వారికి పొలాల్లో దేవిబారు మృతదేహం కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. నిందితులు పోలీసుల అదుపులో ఉండగా కేసును సిఐ డి.జయకుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

➡️