భవనం ఆస్తి విలువ రూ.50వేలే!

Jan 11,2024 21:06

ప్రజాశక్తి – పాలకొండ: స్థానిక నగరపంచాయితీ పరిధిలో ఎంత విలువైన భవంతి ఉన్నా కూడా దాని విలువ రూ.50వేలు మాత్రమే. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా లక్షలాది రూపాయల విలువ ఉన్నప్పటికీ కూడా నగరపంచాయితీ అధికారులు మాత్రం అస్తి విలువ రూ.50వేలు మాత్రమే అని చెప్పడం విడ్డూరం. పట్టణంలో నిర్మాణమైన భవనం మార్కెట్‌ విలువ చదరపు అడుగు రూ.2500 వరకు ఉంది. ఈ లెక్కన అయితే వెయ్యి చదరపు అడుగుల భవనం రూ.25లక్షల వరకూ ఉంటుంది. అయితే నగర పంచాయతీ అధికారులు మాత్రమే రూ.50వేలు మాత్రమే ఇవ్వడం పట్ల పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీకి ఆనుకొని కొండాపురం, తుమరాడ గ్రామపంచాయతీలో ఇంటి విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఇస్తున్నారు. అయితే నగర పంచాయతీలు రెండు అంతస్తుల భవంతి ఉన్నా కూడా దాని విలువ రూ.50వేలు మాత్రమేనని నగరపంచాయితీ అధికారులు అనడంతో సాల్వెన్సు సర్టిఫికెట్‌ కోసం వెళ్తున్న ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి. అదేంటి అలా అని ప్రశ్నిస్తే ఇక్కడ ఇంతే. ఇంతకంటే ఎక్కువ విలువను చూపడం కుదరదు అని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న భవంతుల విలువతో పోల్చుకుంటే నగరపంచాయితీలో ఉన్న భవనాల యజమానులకు మాత్రం విలువ లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగరపంచాయతీ ఉద్యోగుల నిర్వాకంతో కమిషనర్‌ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి పన్నులు లక్షల్లో వసూలు చేస్తున్న అధికారులు సాల్వెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి మాత్రం ఆస్తివిలువ తగ్గించి కేవలం రూ.50వేలకు మాత్రమే ఇవ్వగలమని చెప్పటంతో ప్రజల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి సాల్వెన్సీ సర్టిఫికెట్లకు ప్రస్తుత మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.ఈ విషయమై నగరపంచాయతీ కమిషనర్‌ సర్వేశ్వరరావును వివరణ కోరగా, నగరపంచాయితీ పరిధిలో యాభై వేలకు మాత్రమే సాలవెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వగలం. అంతకు మించి ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పారు.

➡️