భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలి

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : భవన నిర్మాణ కార్మికుల నిధులతో ఏర్పాటైన వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించి, అందులో ఉన్న నిధులను భవన నిర్మాణ కార్మికుల కోసం ఖర్చు చేయాలని విశాఖ జిల్లా బిల్డింగ్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు బి.వెంకటరావు డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారానే అమలు చేస్తున్నారని, అదే విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత 6 నెలలు ఇసుక నిలిపివేయడం, తరువాత కోవిడ్‌ కారణంగా పనులు దొరక్క పోవడంతో భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని గుర్తుచేశారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు చెందిన డబ్బులు సుమారు రూ.1,300 కోట్లు వేరే పథకాలకు మళ్లించి, భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారన్నారు. యూనియన్‌ అధ్యక్షులు పి.అనసూయ మాట్లాడుతూ, వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కెవిపి చంద్రమౌళి, భవన నిర్మాణ నాయకులు కె.నరసింగరావు, సిమ్మ నాయుడు, మసూరి అప్పారావు, రామారావు, బుజ్జి, నారాయణరావు, రాము నాయుడు, మద్ది సిరినాయుడు, పార్వతమ్మ, చిన్న, యర్రమ్మ, పెద్ద యర్రమ్మ, లక్ష్మిహ, పెంటారావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️