మట్టిపనులతో గ్రామాలపై ఇసుక తుపాను

Mar 20,2024 21:22

ప్రజాశక్తి – భోగాపురం : విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా మట్టి పనులు జరుగుతుండంతో వచ్చే ధూళితో సమీప ప్రాంతంలోని సుమారు పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు ఇసుక తుఫానులా గాలికి ఎగిరి గ్రామాలపైకి ఈ ధూళి రూపంలో ఎగిరిపడుతోంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే తామే రొడ్డెక్కి పోరాటాలకు దిగుతామని, విమనాశ్రయానికి వెళ్లే వాహనాలను అడ్డుకుంటామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.మండలంలో విమానాశ్రయం నిర్మాణం పనులు గత కొన్ని రోజులు నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం మట్టి చదును పనులు చురుగ్గా చేపడుతున్నారు. దీంతో ఆ ప్రాంతలో ఎర్రటి మట్టితో కూడిన ధూళి విపరీతంగా మధ్యాహ్నం సమయంలో గాలికి గ్రామాల్లోకి ఎగిరిపడుతుంది. ఒక్కోరోజు అయితే ఏకంగా ఇసుక తుఫానును తలపిస్తుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గూడెపువలస, రాళ్ళపాలెం, బైరెడ్డిపాలెం, దల్లిపేట, రెడ్డికంచేరు, దిబ్బలపాలెం, పిన్నింటిపాలెం, చేపలకంచేరు గ్రామల పరిస్థితిని చెప్పనక్కర్లేదు. ఇళ్ళలోకి ఎర్ర ధూలి గాలికి ఎగిరిపడుతుండడంతో ఇంట్లోని వస్తువులన్ని ఎర్రగా మారిపోతున్నాయి. గాలిలోని ధూళిని పీల్చడం వల్ల ఏమైనా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. చిన్నపిల్లలు ఊపిరితీసేందుకు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. చివరకు ఆహార పదార్ధాలు మూతలు తీయాలన్నా భయమేస్తుందని ఆవేదన చెందుతున్నారు.నీటితో తడపకపోవడం వల్లనే ధూళిమట్టి పనులు జరుగుతున్న చోట ఆయా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ధూళి ఎగరకుండా నీటితో తడపాలి. కాని నిర్మాణ సంస్థ అలాంటి చర్యలు ఏవీ చేపట్టడం లేదని ఈ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు మధ్యాహ్నం గూడెపువలస, రాళ్లపాలెం గ్రామాల సమీపంలో విపరీతంగా గాలికి ఈ ధూళి ఎక్కువగా ఎగురుతోంది. చేపలకంచేరు రహదారిలో వెళ్ళాలటే ఆ ప్రాంత వాసులు భయపడుతున్నారు. అంతేకాక ఒక్కోసారి ఈ ధూళికి ముందు నుంచి వస్తున్న వాహనాలు కూడా కనబడని పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును కడుక్కోవలసిన పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ప్రాంత ప్రజలందరం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలపైకి ధూళి రాకుండా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు..

➡️