మన్యంలో సంక్రాంతి శోభ

Jan 11,2024 21:03

ప్రజాశక్తి – కురుపాం : పచ్చని పొలాలు.. కళ్లాల్లో పండిన పంటలు… తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెల్ల ఆప్యాయతా అనురాగాలు.. ఉన్నంతలో కలిసిమెలిసి సాగే జీవనం.. ఒక్కమాటలో చెప్పాలంటే పల్లెలోగిలికి కుటుంబమే ఆభరణం.. ఇదీ మన పల్లె ఖ్యాతి.. కానీ పల్లెల్లో ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వీధుల్లో తాళం వేసిన ఇళ్లు… చెట్ల కింద వృద్ధుల నిరీక్షణ.. ఏవైనా పండగలు వస్తే తప్ప పల్లెల్లో కళ లేకుండా పోయింది. సొంతూరిని, కన్నవారిని కులసుకొనేలా ‘సంక్రాంతి పండగ తెచ్చింది. పిల్లలంతా బతుకు తెరువుకు పట్టణాలకు పోతే ఇంటివద్ద నిరీక్షిస్తున్న ముసలి ప్రాణాలకు మళ్లీ వీరి రాకతో గ్రామాల్లో ప్రేమబంధాలు వెల్లివిరుస్తున్నాయి. గ్రామాల్లో చేసేందుకు పనిలేక పొట్టకూటి కోసం ఊరు విడిచి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు సంక్రాంతి పండగకు చేరుకుంటున్నారు. వలసలు పోవడంతో నిన్నటివరకు జనసంచారమే లేక గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి బోసి పోయిన గ్రామాలు నేడు జనంతో సందడిగా కనిపిస్తున్నాయి. వలసలతో ఆత్మీయ బంధాలతో పాటు బాల్యం కనుమరుగై పోగా అక్కున చేర్చుకునే అలనా, పాలనా కరువై అష్టకష్టాలుపడుతున్న చిన్నారులకు మరో పది రోజుల పాటు తల్లిదండ్రుల ప్రేమానురాగాలను పొందనున్నారు. సంక్రాంతి పెద్ద పండగ కావడంతో ఉపాధి, ఉద్యోగాలు, వివిధ పనుల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఆరు నెలలుగా సంపాదించిన సొమ్ముతో ఇళ్లకు సున్నాలు వేసి, కొత్త దుస్తులు కొనుక్కొని సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోనున్నారు. మండలం కేంద్రంలో బస్సుల నుంచి దిగే కూలీలే గత వారం రోజులుగా కనిపిస్తున్నారు.మన్యం సంతకు సంక్రాంతి శోభ మండల కేంద్రంలో జరిగే వారపు సంతకు సంక్రాంతి శోభ సంతరించుకుంది. వారపు సంతలో కొత్తబట్టలు కొనుగోలుదారులతో బట్టల దుకాణాలు కిటకిటలాడాయి. మండల కేంద్రంలో గురువారం జరిగిన వారపు సంతకు భోగి పండుగకు రెండు రోజులు ముందు కావడంతో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గిరిజనులు క్రయవిక్రయాలు జరిపారు. మన్యం ప్రాంతంలో గిరిజనులు అన్ని అవసరాలకు వారపు సంతపైనే ఆధారపడతారు. మైదాన ప్రాంతానికి వెళ్లి కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం గనుక అందుబాటులో ఉన్న వారపు సంతలను ఆశ్రయిస్తారు. సంక్రాంతి పండగ అంటేనే ఆచార సాంప్రదాయాలతో కూడిన పండగ. గిరిజన రైతులు పండించిన, సేకరించిన వాణిజ్య పంటలైన చిక్కుళ్లు, ఎర్ర కందులు, తెల్లకందులు, పసుపు, పిప్పళ్లు, గుమ్మడి కాయలు, కొండ చీపుర్లు, కరక్కాయలు వంటి అటవీ ఉత్పత్తులను సేకరించి ఆదాయాన్ని సమకూర్చుకొని పండగ అవసరాలు తీర్చుకుంటున్నారు. పండుగకు ఇంటికి ఎవరు వచ్చినా మద్యం ఇస్తారు. అదే గిరిజనుల ఆచారం సంక్రాంతి పండుగ శోభతో వారపు సంతల్లోనూ, గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి.

➡️