మన్యం గజగజ

Dec 24,2023 21:09

ప్రజాశక్తి – కురుపాం : మన్యంపై చలి పులి పంజా విసురుతోంది. ఉదయం 8గంటలు దాటినా ప్రజలు బయటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. పొగమంచు పూర్తిగా కమ్ముతోంది. దీనికి తోడు చల్లని గాలులు వీస్తుండడంతో ఎముకలు కొరికే చలి ప్రజల్ని వణికిస్తోంది. గతేడాది ఇదే రోజుల్లో రాత్రి వేళల్లో 22 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఇప్పుడు 20 నుంచి 19 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఆదివారం 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. దీంతో బయటకు రావాలంటే పిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతొ ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఎక్కువగా బయట పడుతున్నాయి.పెరుగుతున్న చలివాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 27 నుంచి 28 డిగ్రీలు వరకూ నమోదవుతుండగా రాత్రి వేళల్లో మాత్రం 20 నుంచి 19 డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత ఉదయం 8 గంటలు దాటినా తగ్గడం లేదు. ఈ చలి తీవ్రత రాబోవు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీచలి తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో స్వెట్టర్లకు ఉన్ని దుస్తులకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. మండల, జిల్లా కేంద్రాల్లో భారీగా స్వెటర్లు, ఉన్ని దుస్తులు అమ్మకందార్లు పెద్ద సంఖ్యలో దుకాణాలను నెలకొల్పి వ్యాపారాలు సాగిస్తున్నారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పలువురు వాటి కొనుగోలుకు క్యూ కడుతున్నారు.వెంటాడుతున్న వ్యాధుల భయం ప్రస్తుతం కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ చలిలో వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. చలి వల్ల కొంతమంది ఊపిరితిత్తులు ఆయాసానికి గురవుతాయి. చర్మం పగుళ్లు బారడం ఆరంభమవుతుంది. మిగతా వారితో పోలిస్తే చలికాలం పసికందులు, వృద్ధులకే సమస్యలెక్కువ. ఈ కాలం నీళ్లల్లో రెసిస్టెన్స్‌ లోపించి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. దగ్గుతో కఫాన్ని బయటికి తెప్పించే శక్తి లేకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఎక్కువవుతుంది. వృద్ధుల్లో ప్రత్యేకించి ఆర్థరైటిస్‌ ఉంటే ఎముకలు మరింత బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. కదలికలు తగ్గి కొన్నిసార్లు పట్టు తప్పి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పసికందులను చలిగాలి సోకకుండా వెచ్చగా ఉంచాలి. స్వెటర్లు, మెత్తని రగ్గులు వాడాలి. చలికాలంలోనే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు రక్తనాళాలు మూసుకుపోయి, రక్తాన్ని శరీర భాగాలకు పంపిణీ చేయడం గుండెకు కష్టమవుతుంది. ఈ స్థితిలో గుండె రక్తాన్ని పంపిణీ చేయడానికి ఎక్కువగా శ్రమిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. ప్రత్యేకించి వృద్ధుల్లో సిస్టాలిక్‌, డయాస్టాలిక్‌ రక్తపోట్లు రెండూ పెరుగుతాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తులై ఉంటే వారిలో చల్లగాలి వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి.పొగ మంచుతో ఇబ్బందులు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు పొగమంచు కురుస్తుండడంతో తెల్లవారుజాము నుంచి 7గంటల వరకూ రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం పలువురు చిరు వ్యాపారులు సొంత గ్రామాల నుంచి వివిధ వ్యాపారాల కోసం మండల కేంద్రాల నుండి గిరిజన గ్రామాలకు గిరిజన ప్రజలు మండల కేంద్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సైకిళ్లు, మోటారు వాహనాలపై రావాల్సి వస్తుండడంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మంచు ధాటికి ద్విచక్ర, పెద్ద వాహనాలు నడపడం డ్రైవర్లకు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగమంచు వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని భయాందోళనకు గురవుతున్నారు.

➡️